Minister Niranjan Reddy: దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కానీ, కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలనలో భాగంగా మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, సంయుక్త సంచాలకులు సరోజినిదేవి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. షిరిడీ సమీపంలో ద్రాక్ష, జామ తోటలు పరిశీలించి స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, రైతులతో సమావేశమయ్యారు.
షిరిడీ ప్రాంతంలో వర్షపాతం వివరాలు, పంటల రకాలు, సాగు నీటి వసతి, వ్యవసాయ, ఉద్యానోత్పత్తుల మార్కెటింగ్‌పై స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించడం ద్వారా పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో మార్గదర్శనం చేయాలని సూచించారు. అది రైతుకు న్యాయం జరిగేలా ఉండాలని... రైతుకు ఎంత చేసినా తక్కువేనని అభిప్రాయపడ్డారు. పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో రైతుకు సాయం చేయాల్సిన కేంద్రం.. చేటు చేస్తోందని ఆక్షేపించారు. భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మళ్లాలని... యువత వ్యవసాయంలో తమదైన ముద్ర వేయాలని తెలిపారు. తెలంగాణలో పంటల వైవిద్యీకరణ కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.