తెలంగాణ

telangana

'రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ కావాలా..? మోటార్లకు మీటర్లు పెట్టే మోదీ కావాలా..?'

By

Published : Oct 18, 2022, 8:44 PM IST

KTR Teleconference With Farmers: మోటార్లకు మీటర్లు పెడుతున్న మోదీ కావాలా.. రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ కావాలో మునుగోడు రైతులు ఆలోచించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరారు. మోటార్ల వద్ద ప్రీపెయిడ్ మీటర్లు పెడితే.. ఉచిత విద్యుత్ పోయి ముందుగా డబ్బులు కడితేనే విద్యుత్ సరఫరా వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. మునుగోడులో భాజపా గెలిస్తే కేంద్ర రైతు వ్యతిరేక విధానాలకు ప్రజామోదం లభించినట్లు అవుతుందన్నారు. రైతున్నలు ఆలోచించి.. భాజపాకు బుద్ధి చెప్పి తెరాసకు మద్దతుగా నిలిచేలా ఓటేయాలని కేటీఆర్ కోరారు.

KTR
KTR

KTR Teleconference With Farmers: తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకొని మునుగోడు రైతులు ఆలోచించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరారు. మునుగోడు నియోజకవర్గ రైతులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు ప్రతీ సంవత్సరం ఉచిత కరెంటు ఇచ్చేందుకు రూ.10,500 కోట్ల ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణనే అన్నారు. రైతు బంధు ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.58 వేల కోట్లు అన్నదాతలకు అందించినట్లు కేటీఆర్ వివరించారు.

కృష్ణా జలాల్లో మన వాటాను కేంద్రం తేల్చడం లేదు.. కరోనా సంక్షోభంలోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల నుంచి ప్రతీ గింజ కొనుగోలు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 17వేల కోట్ల రూపాయలతో ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి.. ఇంటింటికి మంచినీరు ఇచ్చింది తెరాస ప్రభుత్వమేనని రైతులు ఆలోచించాలని కోరారు. లక్ష్మణ పల్లె, కృష్ణరాయని పల్లె, శివన్న గూడెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందని.. కానీ, కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల వాటాలు తీర్చకుండా మోకాలడ్డుతోందని కేటీఆర్ ఆరోపించారు.

భాజపా కుట్రలు ఫలిస్తే రైతులకు మద్దతు ధర లభించదు.. నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ సరఫరా కంపెనీలను ప్రైవేటుపరం చేసి ఉచిత విద్యుత్తును రైతులకు దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. డిస్కంలు ప్రైవేటు పరమైతే పెట్రోల్ ధరల మాదిరే విద్యుత్ ధరలు ఆకాశాన్ని అంటుతాయన్నారు. భాజపా ప్రభుత్వ కుట్రలు ఫలిస్తే రైతుల మోటార్ల వద్ద ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయని.. అప్పుడు ముందస్తుగా డబ్బులు కడితేనే విద్యుత్ అందే పరిస్థితి వస్తుందన్నారు. ప్రైవేట్ కంపెనీల ద్వారా ధాన్యాన్ని సేకరించే విధానానికి భాజపా ప్రయత్నిస్తోందని.. దానివల్ల రైతులకు కనీస మద్దతు ధర లభించని పరిస్థితి వస్తుందని కేటీఆర్ తెలిపారు.

ఒక కాంట్రాక్టర్‌ ప్రయోజనం కోసం వచ్చిన ఉపఎన్నిక..ప్రాణం పోయినా మోటార్ల వద్ద మీటర్లు పెట్టనీయనంటూ కేంద్రంపై పోరాడుతున్న కేసీఆర్​ను, తెరాసను సమర్థించాలని రైతన్నలను కేటీఆర్ కోరారు. భాజపా గెలిస్తే రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్రం రద్దు చేస్తుందని రైతులను హెచ్చరించారు. మునుగోడు ఎన్నికను దేశం మొత్తం చూస్తోందని... ఇక్కడ భాజపా గెలిస్తే కేంద్ర రైతు వ్యతిరేక విధానాలకు ప్రజామోదం లభించినట్టు అవుతుందన్నారు. మునుగోడు రైతన్నలు ఆలోచించి ఓటేయాలని.. భాజపా అబద్దపు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. ఒక కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం ప్రజలపై ఉపఎన్నిక రుద్దిన భాజపాకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details