ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ సర్వీసులు ప్రారంభించిన కేటీఆర్ - ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ సేవలు ప్రారంభించిన కేటీఆర్
16:35 September 07
ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్ సర్వీసులు ప్రారంభించిన కేటీఆర్
క్రమబద్ధీకరణ పథకం ద్వారా ప్లాట్లు, లేఅవుట్ల యజమానులు పూర్తిస్థాయి హక్కులను పొందడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి... అవగాహన కోసం పోస్టర్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియక ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఇదే మంచి అవకాశమని తెలిపారు. అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, క్రమబద్ధీకరణ ఫీజును 2021జనవరి 31లోగా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, దేవాదాయ భూములు, చెరువుల శిఖం భూముల్లో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తించదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.