ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్... కరోనా టీకా వేసుకున్నారు. టీకా మొదటి డోసు తీసుకున్న కేటీఆర్.. వ్యాక్సిన్ వేసుకున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తనకు వ్యాక్సిన్ వేసేందుకు సహకరించిన వైద్యులు, టీకా వేసిన నర్సును కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఎంతో మందికి టీకాలు వేస్తూ... విలువైన సేవలు అందిస్తున్న సిబ్బంది అందరికీ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
వాళ్లందరికీ థాంక్యూ...
"ఈరోజు నా మొదటి కర్తవ్యాన్ని నెరవేర్చాను. నాకు టీకా వేసిన నర్సు కెరినా జ్యోతి... సహకరించిన వైద్యులు డా. శ్రీకృష్ణకు ధన్యవాదాలు. వీళ్లతో పాటు ఫ్రంట్లైన్ వారియర్లుగా విశేష సేవలందిస్తోన్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు."- కేటీఆర్, మంత్రి
ఇంత లేట్గానా...?
మంత్రి కేటీఆర్ చేసిన పోస్టుకు ఎంతో మంది నెటిజన్లు స్పందించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని... పలువురు జాగ్రత్తలు చెప్పారు. మరికొంత మంది ఆయన వేసుకున్న వ్యాక్సిన్ ఏంటని ఆసక్తిగా అడిగారు. ఇంకొందరు.. ఇప్పటికే చాలా లేటయిందని నిట్టూరిస్తే.. దానికి సమాధానాలిచ్చే పనిలో మరికొంత మంది ట్వీట్లు చేశారు.
అందుకే లేటైంది...
ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్.. కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్లో ఉండి కోలుకున్నారు. కరోనా సమయంలో తనకు కూడా తీవ్ర ఇన్ఫెక్సన్ సోకినట్లు మంత్రి ట్విట్టర్ వేదికగా తెలిపారు. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మహమ్మారిని జయించగలిగానని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలని సూచించిన కేటీఆర్.. కరోనా బారిన పడటం వల్ల ఇన్ని రోజులు వ్యాక్సిన్ వేసుకోలేదు. కరోనాను జయించిన అనంతరం మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవచ్చన్న వైద్యుల సూచన మేరకు.. నేడు టీకా మొదటి డోసును మంత్రి తీసుకున్నారు.