ఫ్రెంచ్ కంపెనీలకు.. ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరం సదస్సులో కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. "కొవిడ్ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం" అన్న అంశంపై ప్రతిష్టాత్మక సదస్సులో మంత్రి ప్రసంగించారు.
గణనీయమైన స్వయం ప్రతిపత్తి..
అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగమిస్తున్న తీరును సదస్సులో వివరించిన మంత్రి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పరిశ్రమలకు భూకేటాయింపులు, ఆమోదం, అనుమతులు, నైపుణ్యం కలిగిన మానవవనరులను అందించడం, వనరుల సేకరణ విధానాలు వంటి బహుళ కార్యాచరణ అంశాల్లో భారతదేశంలోని రాష్ట్రాలు గణనీయమైన స్వయం ప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పక్షం రోజుల్లోనే అనుమతులు..
తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు.. రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సెనేట్ వేదికగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. దేశంలోనే తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రమన్న కేటీఆర్... టీఎస్ ఐపాస్ విధానం పారదర్శకతతో కూడిన స్వీయ ధృవీకరణతో అనుమతులు ఇస్తోందని... పక్షం రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు లభిస్తున్నాయన్నారు. 15 రోజుల వ్యవధిలో అనుమతుల జారీ జరగకపోతే 16వ రోజు పూర్తి అనుమతులు వచ్చినట్లు డీమ్డ్ అప్రూవల్ వచ్చినట్లేనని వివరించారు.
హైదరాబాద్ కచ్చితమైన ప్రాంతం..