Ts Budget session: బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. సింగరేణి ఆధ్వర్యంలోని ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ ఓబీ కాంట్రాక్టులపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు. టెండర్ అర్హతను కొద్ది మందికి ఉపయోగపడేలా పెట్టారని ఆరోపించారు. సింగరేణికి 20 వేల కోట్ల నష్టమొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా కోల్ ఇండియా టెండర్లు ఆహ్వానిస్తే.. ఇక్కడ మాత్రం కొందరి వ్యక్తుల కోసం ఇష్టానుసారం వ్యవహరించారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.
"సింగరేణి ఆధ్వర్యంలోని ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ కొన్ని రోజుల క్రితం టెండర్లు ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా.. ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా.. పారదర్శకంగా టెండర్లు పిలిచింది. అదే నైనీ కోల్ బ్లాక్‌లో టెండర్లు ఖరారు చేసేందుకు ఇష్టానుసారం వ్యవహరించారు. కొందరి ప్రయోజనాల కోసం నిబంధనలను పక్కనపెట్టారు. సింగరేణి సంస్థకు రూ.20 వేల కోట్లు నష్టమొచ్చే విధంగా వ్యవహించారు."
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
కోమటిరెడ్డి ఆరోపణలను మంత్రి జగదీశ్‌రెడ్డి ఖండించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిబంధనలనే అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టుల కోసం కొందరు వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి ఆరోపణలు చేశారు. ఉన్న పదవులు అడ్డం పెట్టుకొని బేరాలు చేసుకొనే బేరగాళ్లు.. రాష్ట్రంలో తయారయ్యారంటూ మండిపడ్డారు. చాలా ఏళ్లుగా సింగరేణిలో కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారో.. ఈసారి ఆ నిబంధనలనే అమలుచేసినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇతరులకు అవకాశం ఇవ్వకుండా చేసిన వాళ్లు.. ఇవాళ తెరాస ప్రభుత్వంలోనూ అదే జరుగుతోందనే భ్రమలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్రంలో కొందరు వ్యాపారులు రాజకీయనేతలు అయ్యారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేయడం తప్ప వేరొకటి చేయరు. వారి బతుకుతెరువు కోసం ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తారు. ఉన్న పదవులు అడ్డంపెట్టుకొని.. బేరాలు చేసేవాళ్లు రాష్ట్రంలో తయారయ్యారు. సింగరేణి చరిత్రలో ఇన్నాళ్లు టెండర్లు ఎలా పిలిచామో.. ఇప్పుడూ అలానే చేశాం. కాంగ్రెస్ హయాంలో ఇంకెవరినీ రానీయకుండా కాంట్రాక్టులు దక్కించుకున్న కొందరు.. ఇవాళ కూడా ఇలానే జరుగుతోందని అనుకుంటున్నారు."
- జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్రవాగ్వాదం ఇదీచూడండి:'ఎక్కడో ఒకట్రెండు చోట్ల జరిగే సమస్యలనే ఎత్తిచూపుతున్నారు'