ఈ నెల 25న ప్రారంభంకానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో అందరికీ భాగస్వామ్యం కల్పించి విజయవంతం చేయాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. నాటిన మొక్కలను సంరక్షించేలా చూడాలని మంత్రి కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
లక్ష్యానికి చేరువలో...
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్... రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు182 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి వివరించారు. పట్టణాలు, గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు.