రాష్ట్రానికి రావాల్సిన రూ.2,641 కోట్ల ఐజీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. బకాయిల విషయమై బిహార్ ఉపముఖ్యమంత్రి, ఐజీఎస్టీ కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం జరిగింది. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ సహా 16 రాష్ట్రాలకు 2018 నుంచి రావాల్సిన రూ.25,058 కోట్ల ఐజీఎస్టీ నిధుల విషయమై సమావేశంలో చర్చించారు.
భేటీకి ముందే ఇచ్చేలా సిఫార్సు చేయండి
రాష్ట్రానికి రూ.2,641 కోట్లు రావాల్సి ఉండగా... రూ.2,638 కోట్లు ఐజీఎస్టీ చెల్లించాల్సి ఉందని కౌన్సిల్ లెక్కలు వేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వచ్చే నెల 5న జరిగే జీఎస్టీ మండలి భేటీకి ముందే విడుదల చేయాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. వారం రోజుల్లో సిఫార్సు చేయాలని కమిటీ కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీకి విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ నిధులు వస్తే చాలా ఊరట కలుగుతుందని అన్నారు.