చట్టానికి లోబడే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్‌కుమార్ వెల్లడించారు. కృష్ణా నది నుంచి చుక్కనీరు కూడా ఎక్కువ తీసుకోవడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ పెడితే.. తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని.. ఆర్‌డీఎస్ (RDS)కు సంబంధించి ఏపీకి 4 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏపీలో ఎక్కడా ప్రాజెక్టులు అక్రమంగా కట్టడం లేదన్న మంత్రి అనిల్... తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు. నీళ్లు అక్రమంగా తరలిస్తున్నారనడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఏపీకి కేటాయించిన జలాలు తీసుకెళితే ఏవిధంగా తప్పవుతుందని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ కాపాడుతున్నారని మంత్రి అన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార జల వివాదాల ట్రైబ్యునల్ అనుమతి కావాలన్నారు.
చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి..
చట్టానికి లోబడే రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని మంత్రి అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఏపీకి కేటాయించిన నీటి వాటాకు లోబడే ఈ నిర్మాణాలు ఉంటాయన్నారు. శ్రీశైలంలో 881 అడుగులుంటేనే పోతిరెడ్డిపాడు(pothireddypadu) నుంచి తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీశైలంలో 848 అడుగులుంటే చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులను 15 రోజులే తీసుకునే పరిస్థితి ఉందని.. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్టు ఏర్పాటు తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని ప్రశ్నించారు.
సుంకేశుల ప్రాజెక్టు సక్రమమైందా.. ?
కృష్ణా నది నుంచి చుక్కనీరు కూడా మేం ఎక్కువ తీసుకోవడం లేదు. 6 టీఎంసీల సామర్థ్య ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోంది. శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగులున్నా లిఫ్ట్ చేసేలా తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయి. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు సామర్థ్యం పెంచారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ లిఫ్టు ఏర్పాటు చేశారు. సుంకేశుల వద్ద తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు సక్రమమైందా.. ? మీరు చేస్తే తప్పులేదు.. మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా..? మా రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు కట్టడం లేదు. కృష్ణా నుంచి సరిపడా నీరు తీసుకునేందుకే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నాం.