శీతాకాలంలో పాల ఉత్తపత్తి ఎక్కువగానే ఉంటోంది. కానీ ఇక్కడ పాల ఉత్పత్తి అంతగా పెరగలేదు. ఎందుకుంటే ఇప్పటికి కూడా కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విజయతో పాటు, కరీంనగర్, ముల్కనూర్, రంగారెడ్డి-నల్గొండ జిల్లాలకు చెందిన నార్ముల్ డెయిరీల పరిధిలో సుమారు 2 లక్షల మంది రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.100 కోట్ల బకాయిలు ఏడాదికాలంగా పేరుకుపోయాయి. ఈ డెయిరీలకు రోజూ పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఈ క్రమంలో ఆ నిధుల పంపిణీ బాధ్యతలు చూసే విజయ డెయిరీ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల సిద్దిపేట జిల్లా పాడిరైతులకు మాత్రమే ఈ బకాయిలను పశుసంవర్ధకశాఖ విడుదల చేసింది.
ఎందుకీ సమస్య..
రాష్ట్ర రాజధానిలో పాలు, పాల ఉత్పత్తులు అధికంగా విక్రయించే విజయ డెయిరీకి రోజూ 3.50లక్షల లీటర్ల పాలు అవసరం. ప్రస్తుతం రోజుకు 2.60లక్షల లీటర్ల వరకే రైతుల నుంచి వస్తున్నాయి. మిగతావి కర్ణాటక, స్థానిక చిన్న డెయిరీల నుంచి కొంటోంది. లాక్‌డౌన్‌కు ముందు నుంచే కొరత కారణంగా విజయ డెయిరీ ఇతర రాష్ట్రాల నుంచి పాలు కొంటోంది. వానాకాలంలో వర్షాలు బాగా పడటం, పంటల అధిక సాగు వల్ల పాల ఉత్పత్తి సైతం అధికమవుతుందని సీజన్‌కు ముందు అంచనా వేశారు. కానీ పాడిరైతులకు ప్రోత్సాహకాలేమీ లేకపోవడంతో, పంటల సాగుపై ఎక్కువ శ్రద్ధ పెట్టారని, అందుకే పాల ఉత్పత్తి పెరగలేదని ఓ అధికారి వివరించారు. ఖర్చులు భరించలేక పాడి పశువులను రైతులు వదిలించుకుంటున్నారు. ఉదాహరణకు ఇటీవల జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యపురంలో పోసిన వేలాది లీటర్ల పాలు నాణ్యంగా లేవని లీటరుకు రూ.19.50 మాత్రమే చెల్లించినట్లు అక్కడి రైతులు ‘ఈనాడు’కు చెప్పారు. ఇంత తక్కువ ధర గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.