తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వస్థలాలకు పయనమవుతోన్న కూలీలు.. కిటకిటలాడుతోన్న బస్​స్టేషన్లు

లాక్‌డౌన్‌ భయంతో వలస కూలీలు మళ్లీ స్వస్థలాల బాట పడుతున్నారు. వైరస్‌ విజృంభనతో ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో మళ్లీ భయం నెలకొంది. లాక్‌డౌన్ విధిస్తారని ఊహించుకుని కొందరు సొంతూళ్లకు పయనమవుతుండటంతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులు స్వస్థలానికి తిరిగి వచ్చేస్తున్నారు.

migrants returning to their home towns in telangana
migrants returning to their home towns in telangana

By

Published : Apr 23, 2021, 4:47 AM IST

Updated : Apr 23, 2021, 6:36 AM IST

స్వస్థలాలకు పయనమవుతోన్న కూలీలు.. కిటకిటలాడుతోన్న బస్​స్టేషన్లు

విద్య, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో... వివిధ రాష్ట్రాల ప్రజలు చాలామంది జీవిస్తుంటారు. భవన నిర్మాణ కార్మికులు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు గ్రేటర్ పరిధిలో నివసిస్తున్నారు. గతేడాది ఒక్కసారిగా లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికులు ఉక్కిరిబిక్కిరై.. సొంతూళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కిలోమీటర్ల మేర నడిచివెళ్లారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకున్నారు. రెండో దశ కరోనా ఉద్ధృతి వేగంగా విస్తరించడంతో రాష్ట్రంలో రాత్రికర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మరోసారి ఎక్కడా లాక్‌డౌన్‌ విధిస్తారోనన్న భయం వలస కార్మికుల్లో మొదలైంది. వైరస్‌ ఉద్ధృతి సహా కర్ఫ్యూతో వలస జీవులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.

ఇక్కడే ఉండి వైరస్‌ బారిన పడటంకంటే.... సొంతూరుకు వెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చంటున్నారు వలస కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఇతర కార్మికులు, విద్యార్థులు సైతం స్వగ్రామాలబాట పడుతున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తామని చెబుతున్నారు సొంతూళ్లకు వెళ్లేవారితో గ్రేటర్ పరిధిలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గత రెండురోజుల్లో ఎంజీబీఎస్​ నుంచి జిల్లాలకు ప్రయాణించిన వారి సంఖ్య రెట్టింపైందని... అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహరాష్ట్రలకు ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులు వెళ్లారని వివరించారు. మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎక్కువ మంది వెళ్లినట్లు పేర్కొన్నారు. వారంరోజులుగా ఏపీకి వెళ్లే శాతవాహన, గోదావరి, గౌతమి సహా.. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వెళ్లేరైళు రద్దీగా మారాయి. ఆర్టీసీ బస్సులే కాకుండా ప్రైవేట్ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు.

కరోనా కట్టడికి రైల్వేస్టేషన్లలో.... ప్రయాణికులను ముందస్తుగా రానివ్వట్లేదు.ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ... రైలు వచ్చేగంట నుంచి... రెండు గంటల ముందు మాత్రమే అనుమతిస్తున్నారు. టికెట్లు దొరక్క... రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు బారులు తీరుతున్నారు. మాస్కులు, టికెట్లు ఉన్న వారినే స్టేషన్లలోకి అనుమతిస్తున్నారు. ఇదే సమయంలో ఉపాధి కోసం రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, గుజరాత్‌ వెళ్లినవారు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. ముంబయిలో కొద్ది వారాలుగా భారీగా కేసులు నమోదు కావడంతో.... దాదాపు ఐదారువేల మంది తిరిగివచ్చారు. కోరుట్ల, మెట్‌పల్లి, నిజామాబాద్‌ ప్రాంతాల వారు... ముంబై నుంచి ప్రైవేటు బస్సులు, రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు.

ఇదీ చూడండి: 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు

Last Updated : Apr 23, 2021, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details