CHALO Vijayawada: ఏపీలో మధ్యాహ్న భోజనం అక్షయపాత్రకు ఇవ్వడాన్ని నిరసిస్తూ.. కార్మికులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఎలాంటి ఆందోళనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ దాసరి భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చలో విజయవాడకు వెళ్తున్న ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు కొంతమంది నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Chalo Vijayawada News : విజయవాడ ధర్నా చౌక్ కి వెళ్తున్న కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి బస్సుల్లో ఎక్కించారు. దీంతో పోలీసులకు.. మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తమపై నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని కార్మికులు వాపోయారు. పోలీసుల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై పోరాడితే అక్రమంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.
Tension in Chalo Vijayawada : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 40 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయని.. వాటిలో 88 వేల మంది పని చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర సంస్థకు ఇవ్వడం వల్ల తమ ఉపాధి దెబ్బతిందని వాపోతున్నారు. నిరసనను అడ్డుకోవద్దని కోరుతున్నారు.
కృష్ణా జిల్లా సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవాడకు బయలుదేరిన మధ్యాహ్న భోజన కార్యకర్తలను తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్టు చేశారు. వీరందర్నీ నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు నిర్బంధించారు. చలో విజయవాడకు వెళ్తున్నారన్న సమాచారం మేరకు మహిళలను బలవంతంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ప్రభుత్వం ఏకపక్షంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. చలో విజయవాడకు తరలివచ్చే మధ్యాహ్న భోజన కార్మికులను ఆపేందుకు.. తనిఖీలు చేస్తున్నారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు.
విజయవాడలో..
విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లో మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నగరంలోని కార్మిక సంఘాల నాయకుల ఇళ్ల ముందు కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు ధర్నా చౌక్ లో కూడా వందల మంది పోలీసులతో ఉన్నతాధికారులు భద్రత చర్యలు చేపట్టారు. విజయవాడ దాసరి భవనం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఐటీయూసీ నాయకులు ధర్నాకు బయల్దేరుతుండగా.. పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది.