Hyderabad : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ.. ఆనాటి భాగ్యనగరం జ్ఞాపకాలు
నిలువెల్లా దేశభక్తి.. అణువణువునా స్వాతంత్య్ర స్ఫూర్తి నింపుకొన్న నగరం.. విభిన్న మతాలు.. సంస్కృతీ సంప్రదాయాల నిలయం. వేషభాషలు వేరైనా అందర్నీ అక్కున చేర్చుకున్న మినీ భారత్ హైదరాబాద్(Hyderabad). శతాబ్దాల చరిత్రగల భాగ్యనగరం ఎన్నో ఉద్యమాలు.. మరెన్నో కీలక పరిణామాలకు నిలువుటద్దం. ఇక్కడి దారులు స్వాతంత్య్ర సమరానికి స్వాగతం పలికాయి. తెల్లదొరల పెత్తనంపై పోరు చేసేందుకు అందర్నీ సంఘటితం చేసింది. గోల్కొండ నుంచి సికింద్రాబాద్ వరకూ ఎన్నో ప్రాంతాలు ముందుకు కదిలాయి.. ఎందరో మహనీయులు స్వరాజ్య పోరాటంలో భాగంగా నగర పర్యటనకు విచ్చేశారు. వారి అడుగుజాడల్లో ప్రజలు తెల్లదొరలకు వ్యతిరేకంగా గర్జించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ.. ఆ నాటి జ్ఞాపకాలు.. మననం చేసుకుందాం.
భాగ్యనగరం జ్ఞాపకాలు
By
Published : Aug 14, 2021, 9:15 AM IST
బాపూఘాట్
హైదరాబాద్(Hyderabad)లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ ప్రశాంతతకు గుర్తుగా కనిపిస్తుంది. మూసీ, ఈసీ నదులు కలిసే పవిత్ర సంగమంలో 1948 ఫిబ్రవరి 12న మహాత్మాగాంధీ చితాభస్మం కలిపారు. జ్ఞాపకచిహ్నంగా బాపూఘాట్ నిర్మించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న గాంధీజీకి సంబంధించిన 400కు పైగా ఫొటోలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. గాంధీ సమాధి, ధ్యానమందిరం నిర్మించారు.
సరోజనీ స్వగృహం... గోల్డెన్ త్రెషోల్ఢ్..
అబిడ్స్‌లో కనిపించే గోల్డెన్ త్రెషోల్డ్ భారత కవికోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) సరోజనీనాయుడు స్వగృహం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తొలుత ప్రారంభించింది ఇక్కడే. 1879లో హైదరాబాద్‌లో జన్మించిన సరోజనీనాయుడు బాల్యంలోనే కవితలు, కథలు, వ్యాసాలు రాసేవారు. కులాంతర వివాహం చేసుకున్నారు. గాంధీజీ పిలుపుతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలో మహాత్మునితో కలసి పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయి జైలుజీవితం గడిపారు. గాంధీజీ హైదరాబాద్‌లో పర్యటించినపుడు గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో మొక్క నాటారు. 1970లో అది కూలిపోవటంతో ఆ స్థానంలో మరో మొక్కను గుర్తుగా నాటారు. సికింద్రాబాద్‌లోని ఆక్స్‌ఫర్డ్‌స్ట్రీట్‌కు సరోజనీదేవి రోడ్డుగా పేరు మార్చారు.
తిరుగుబాటులో నవాబు సోదరుడు..
ప్రథమ స్వాతంత్య్ర సమరానికి ముందుగానే బ్రిటీషర్లపై వహాబీ-ఫరైజీలు ఉద్యమించారు. 1820-1870 వరకూ సాగిన తిరుగుబాటుకు రాయబరేలీకి చెందిన సయ్యద్ అహమ్మద్ బరేల్వి పునాది వేశారు. వహాబీ ఉద్యమంగా పేరున్న దీనిలో అప్పటి హైదరాబాద్ నవాబు సోదరుడు ముబారిజుద్దౌలా కీలకంగా వ్యవహరించారు. బ్రిటీష్ రాణికి వ్యతిరేకంగా కుట్రపన్నారనే నేరంపై జైలు శిక్ష విధించారు.
ఆంధ్రమహిళా సభ..
దుర్గాబాయి దేశ్‌ముఖ్.. 12 ఏళ్ల వయసులోనే మహాత్ముని పిలుపుతో విరాళాలు సేకరించి అందజేశారు. రాజమండ్రిలో పుట్టిపెరిగారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ముందుకు నడిపించిన వీరవనిత. మహిళ సాధికారత కోసం ఎంతగానో తపించారు. హైదరాబాద్‌లో ఆంధ్రమహిళా సభను స్థాపించారు. 1981లో హైదరాబాద్‌లో మరణించారు.
మహాత్ముడి అనుబంధం..
నగరంతో బాపూజీకు గొప్ప అనుబంధం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఆయన పలుమార్లు హైదరాబాద్ వచ్చారు. మొదటిసారి 1 ఏప్రిల్ 1919లో నగర పర్యటనకు వచ్చారు. అబిడ్స్‌లోని సరోజనీనాయుడు నివాసంలో బస చేశారు. అనంతరం 1929, 1934ల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. కాచిగూడ, మార్వాడీ పాఠశాల, వివేకవర్ధిని, లాల్‌దర్వాజా ప్రాంతాల్లో ప్రసంగించారు.
ఇది మరో కాలాపానీ
తిరుమలగిరిలోని ఆర్మీ జైలు
అండమాన్ నికోబార్ దీవుల్లోని ‘కాలాపానీ’ సెల్యులర్ జైలు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ ఖైదీలను అక్కడే బందీగా ఉంచేవారు. తిరుమలగిరిలోని మిలటరీజైలు కూడా ఒకప్పుడు బ్రిటీషర్లు నిర్మించిందే. 1858లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.71లక్షల వ్యయంతో మూడంతస్తుల్లో దీన్ని కట్టించారు. 75 గదులుండే ఈ జైలును నేరం చేసిన ఆంగ్లేయ సైనికులను శిక్షించేందుకు ఉపయోగించారు. అక్కడ బందించిన ఖైదీలను గమనించేందుకు కేవలం ఒక్క కిటికీ మాత్రమే ఏర్పాటు చేశారు. ఉరితీసేటపుడు ఖైదీ తప్పించుకోకుండా 100 అడుగుల పైభాగంలో ఉరికొయ్య ఉండేది. ఉరితీయగానే వంద అడుగుల్లోతులో ఉంచిన ఇనుప చువ్వలపై పడిన ఖైదీ మరణించేవాడు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఎంతోమంది ఖైదీలను ఇక్కడ బందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. బ్రిటీష్ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు సుమారు 500 మంది వ్యాధులు, ఉరిశిక్ష అమలుతో చనిపోయారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో పట్టుబడిన ఖైదీలను ఇక్కడ ఉంచారంటారు.
ఉద్యమాలకు తావి.. రావి
స్వాతంత్య్ర సమరయోధుల్లో ధీశాలి రావి నారాయణరెడ్ఢి. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో ముందుకొచ్చిన యువకుడు. 21 ఏళ్ల వయసులోనే మహాత్ముడిని కలిశారు. తన సతీమణి నగలను హరిజన అభ్యుదయ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. 1928లో ఆంధ్రమహాసభ సంస్థను స్థాపించారు. మూఢనమ్మకాలు పారదోలడం, అక్షరాస్యత, వితంతు పెళ్లిళ్లపై ఉద్యమమే నడిపారు. 1934లో గాంధీజీ నగరానికి వచ్చినపుడు బంగారాన్ని విరాళంగా అందజేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారు.