తెలంగాణ

telangana

ETV Bharat / city

కాంగ్రెస్​ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభా వేదిక మార్పు

హైదరాబాద్​ ఇందిరాభవన్​లో ​కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమాశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం బదులుగా రావిరాళ్లలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

congress
కాంగ్రెస్​

By

Published : Aug 13, 2021, 8:40 PM IST

గ్రామ రచ్చబండలు ఏర్పాటు చేసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు రేపటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజల్లోకి వెళ్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇందిరాభవన్‌లో శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటివద్ద డప్పు కొట్టే కార్యక్రమం సమన్వయకర్తలు చేపడతారన్నారు. కాంగ్రెస్ నేతలంతా స్థానిక ఎమ్మెల్యేలను.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారని, ఉపఎన్నికలు వస్తే.. తద్వారా దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు దళిత బంధు వస్తుందని నినాదాలు చేస్తారని వివరించారు. కేసీఆర్ మోసాలతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చాటిచెబుతారని, దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల ప్రాధాన్యత గురించి గ్రామ గ్రామానా ప్రచారం చేస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతామన్న ఆయన హుజూరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆట మొదలైంది.. వదిలిపెట్టేది లేదు..

ఏడేళ్లలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద కేటాయించిన రూ.65 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇవాళ దళితబంధు అవసరం ఉండేది కాదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ అన్నారు. ఆట మొదలయిందని, తెరాస ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని చావడానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాడుతామన్న ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుట్లో జరిగితే ఓటమి తప్పదన్న భయంతో ఉన్న తెరాస ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

సభాస్థలి మార్పు..

అటు ఇబ్రహీంపట్నం బదులుగా రావిరాళ్లలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ విషయం శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నంలో దండోరా సభ నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇంద్రవెల్లి సభలోనే ప్రకటించారు. ఇబ్రహీంపట్నం సాగర్‌ హైవే దగ్గర ఖాళీగా ఉన్న యాభై ఎకరాల స్థలంలో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుని పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసింది. అయితే అక్కడ సభ నిర్వహిస్తే అయిదారు గంటలు ట్రాఫిక్‌ స్తంభించడంతోపాటు.. సాగర్‌ రహదారిలో రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయని భావించిన పోలీసులు అనుమతి నిరాకరించారు. ఔటర్ రింగ్‌ రోడ్డు వద్ద ఎక్కడైనా సభ నిర్వహించుకుంటే తాము అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు.

రావిరాలల్లో సభ

ఇంతలో... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఫోన్‌ చేసి తనకు పార్లమెంటు స్టడీ టూర్‌ ఉందని.. ఈనెల 18వ తేదీన సభకు హాజరు కావడం కుదరదని తెలియజేశారు. అదే విధంగా ఈనెల 21వ తేదీ తరువాత ఎప్పుడైనా సభ పెట్టాలని, సభకు హాజరు కావడానికి తమకు ఏలాంటి అభ్యంతరం లేదని, కలిసి పని చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. దీంతో... ఆయన వినతికి కూడా విలువ ఇచ్చినట్లు అవుతుందని భావించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. సభ స్థలాన్ని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోకి వచ్చేట్లు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రావిరాలల్లో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, రామిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిలతోపాటు పలువురు నాయకులు స్థల పరిశీలన చేశారు. చివరకు రావిరాలలో సభ పెట్టాలని నిర్ణయించడంతోపాటు పోలీసులకు కూడా అనుమతి కోసం దరఖాస్తు చేశారు. రేపు పోలీసుల అనుమతి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేత తెలిపారు.

ఇదీ చదవండి:రాహుల్​కు మరో షాక్​.. ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​ ఖాతాపై!

ABOUT THE AUTHOR

...view details