ఏపీలో బెయిలుపై బయట ఉన్న నేతలు త్వరలో జైలుకు వెళ్తారని కేంద్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ నాయకుడు ప్రకాశ్ జావడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపాకు ప్రత్యామ్నాయంగా రానున్న ఎన్నికల్లో భాజపాను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జరిగిన ‘ప్రజా ఆగ్రహ సభ’కు ముఖ్య అతిథిగా హాజరైన జావడేకర్ తన ప్రసంగం యావత్తు రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ మాట్లాడారు. వైకాపా, తెదేపా, తెరాస.. మూడూ కుటుంబ పార్టీలేనన్నారు. ఈ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తెదేపా, వైకాపా రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. చిన్న పార్టీగా ఉన్న భాజపా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్మాణాత్మక పాలన సాగుతుంటే.. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని మండిపడ్డారు.
రాజధానిపై రెండు పార్టీల ఘర్షణ
‘రాష్ట్రాన్ని రెండు, మూడు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. నేను పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు రికార్డు సమయంలో పోలవరం నిర్మాణానికి అనుమతులు ఇచ్చాను. ఏడేళ్లు గడిచినా అది పూర్తి కాలేదు. ఈ విషయంలో తెదేపా, వైకాపా ప్రభుత్వాలు రికార్డు సృష్టిస్తున్నాయి. అమరావతి రాజధాని కోసం అటవీ భూములను వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాను. అయితే.. రాజధాని విషయంలో రెండు పార్టీలు ఘర్షణ పడుతున్నాయి.’ - ప్రకాశ్‌జావడేకర్
‘పుష్ప’లోలాగే రాష్ట్రంలోనూ..
పుష్ప సినిమాలో లాగే రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ సాగుతోందని ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. ‘నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి వేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్సును ఏపీలో రద్దు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని వైకాపా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ప్రస్తుతం మద్యం విక్రయాలతో వచ్చే డబ్బుతోనే రాష్ట్రంలో పాలన సాగుతోంది. జగన్ ఇచ్చిన వాగ్దానాలను అసలు అమలు చేయట్లేదు’ అని ధ్వజమెత్తారు.