భాగ్యనగరంలో రోజుల తరబడి కురుస్తున్న వానలకు ఇప్పటికీ పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. తేరుకోక ముందే మంగళవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో తీవ్రత ఎక్కువగా ఉంది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వాన ఇబ్బందులపై జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్, యాప్, వెబ్‌సైట్‌తో పాటు డయల్100కు 69 ఫిర్యాదులు వచ్చాయి. 17 చోట్ల వరద నీరు చేరగా.. మూడు ప్రాంతాల్లో పాత గోడలు కూలిపోయాయి. 19 ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. బోడుప్పల్, గచ్చిబౌలిలో లోవోల్టేజీ సమస్య తలెత్తింది. షేక్‌పేటలో నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.