mana ooru mana badi : మన ఊరు-మన బడి పథకం కింద పభుత్వ/స్థానిక పాఠశాలలకు రంగులు వేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలికాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) మే 9న జారీ చేసిన టెండరు నోటిఫికేషన్‌లోని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విశాఖపట్టణానికి చెందిన సువర్ణశ్రీ వెంకటేశ్వర ఇన్‌ఫ్రాకాన్ శుక్రవారం ఉపసంహరించుకుంది. ఏసియన్ పెయింట్స్ లిమిటెడ్‌కు, బెర్గర్ పెయింట్స్ లిమిటెడ్‌కు టెండర్లు కట్టబెట్టడానికి వీలుగా ముందస్తుగా సిద్ధం చేసిన నిబంధనలను రూపొందించారంటూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ ఎస్.నంద విచారణ చేపట్టారు.
మన ఊరు-మన బడి కాంట్రాక్ట్‌పై పిటిషన్ ఉపసంహరణ..
mana ooru mana badi : మన ఊరు మన బడి పథకంలో భాగంగా పెయింటింగ్ టెండర్లను సవాల్ చేసిన సువర్ణ శ్రీ వెంకటేశ్వర ఇన్ఫ్రా సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది. ఏషియన్ పెయింట్స్, బెర్గర్ పెయింట్స్‌కు టెండర్లను కట్టబెట్టడం కోసమే.. సరైన ప్రాతిపదిక లేకుండా టెండరు నిబంధనలను రూపొందించిందని వాదించిన పిటిషనర్ సంస్థ.. నిన్న జరిగిన విచారణలో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అనుమతివ్వాలని హైకోర్టును కోరింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పడంతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు సాయంత్రం అఫిడవిట్ దాఖలు చేయగా న్యాయమూర్తి దీనికి అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ దశలో బిడ్ పొందిన కాంట్రాక్టర్‌కు కాంట్రాక్ట్ అప్పగించవచ్చంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్, మేఘా ఇంజినీరింగ్ సంయుక్త భాగస్వామ్య సంస్థ తరఫున కె.విజయభాస్కర్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున అంతకుముందు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అయిదేళ్లలో ఏదైనా ఒక ఏడాది 131.50 లక్షల చదరపు మీటర్లు రంగులు వేసిన అనుభవం ఉండాలన్న టెండరు నిబంధనకు ప్రాతిపదిక లేదన్నారు. బిడ్ దక్కించుకున్న కంపెనీలకు అర్హత లేదని పేర్కొన్నారు.
మన ఊరు మన బడి పథకం కింద రంగులు వేయడంతో పాటు ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్‌లు, గ్రీన్‌చాక్ బోర్డుల సరఫరాకు కాంట్రాక్ట్‌లు పిలవగా అన్నింటిపై పిటిషన్‌లు దాఖలైన విషయం విదితమే. దీంతో రంగులు వేయడం మినహా మిగిలిన కాంట్రాక్ట్‌లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.