మహాశివరాత్రి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి... కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ధర్మపురి, కోటిలింగాలకు భక్తులు పోటెత్తారు. గోదావరిలో భక్తులు పుణ్యాస్నానాలు ఆచరించి.... మహారుద్రునికి ప్రత్యేక పూజలు చేశారు.
హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాశివుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం శివ నామస్మరణతో మారు మోగింది. కాళేశ్వరంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులుతీరారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దుర్కి సోమలింగేశ్వరాలయంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి దర్శనాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివాలయాలు కిటకిటలాడాయి. ఖమ్మం మండలం తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయంలో పెద్దజాతర నిర్వహించారు. ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగనుంది. మధిర శ్రీమృత్యుంజయ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలంలో గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో అభిషేక మహోత్సవం జరిగింది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి.. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.