తెలంగాణ

telangana

ETV Bharat / city

లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ అవగాహన ఒప్పందం - కేటీఆర్ లండన్ టూర్ అప్‌డేట్స్

KTR London Tour Updates : లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగానే కింగ్స్ కాలేజ్ క్యాంపస్‌ను సందర్శించారు. కింగ్స్ కాలేజ్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే.... ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన.... పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో ప్రభుత్వంతో కింగ్ కాలేజ్ కలిసి పనిచేసేలా ఈ ఒప్పందం జరిగింది.

KTR London Tour Updates
KTR London Tour Updates

By

Published : May 20, 2022, 10:05 AM IST

KTR London Tour Updates : ప్రతిష్ఠాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కింగ్ కాలేజ్ కలిసి పనిచేయనుంది. యూకే పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

KTR London Tour Latest News : రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, కింగ్స్ హెల్త్ పార్ట్‌నర్స్ ఈడీ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. గత నెలలో బ్రిటిష్ కౌన్సిల్ నేతృత్వంలో కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్‌ సహా కింగ్స్ ప్రతినిధులు మన దేశంలో పర్యటించారు. దానికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్ లండన్‌లోని కింగ్స్ కాలేజ్ క్యాంపస్‌ను సందర్శించారు.

తాజా ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో కింగ్స్ కాలేజ్ సహకారం అందించనుంది. ఫార్మాసిటీ , లైఫ్ సైన్సెస్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తోడ్పాటు ఇస్తుంది. టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శితిజ్ కపూర్ అన్నారు.

కింగ్స్‌ కాలేజ్‌తో ఒప్పందం భారత్, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతుందని తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details