LOKESH ON JOURNALIST ATTACK: వైకాపా గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులపై దాడులు అయిపోగా.. ఇప్పుడు పాత్రికేయుల వంతు వచ్చిందని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్ వద్ద జర్నలిస్ట్ ఈశ్వర్‌పై వైకాపా నేత, శ్రీకాళహస్తీశ్వర ఆలయం బోర్డు మెంబర్ జయ శ్యామ్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈశ్వర్‌కు చెందిన స్థలాన్ని కబ్జా చెేయడమే కాకుండా ప్రశ్నించినందుకు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడటం దారుణమని దుయ్యబట్టారు. జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడిన జయశ్యామ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ స్థలాన్ని తిరిగి ఆయనకి చెందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ జరిగింది..:శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి సభ్యుడు బుల్లెట్ జయ శ్యామ్.. స్థానిక రాజ్‌న్యూస్ విలేకరి ఈశ్వర్‌పై దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీ వద్ద తన ఇంటి స్థలాన్ని జయశ్యామ్ కబ్జా చేసి, పునాదులు వేశారని ఈశ్వర్ ఆరోపించారు. ఇదేం న్యాయమని ప్రశ్నించడంతో జయశ్యామ్ దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇటీవల తెదేపా రాష్ట్ర కార్యదర్శి చలపతినాయుడుపై దాడికి పాల్పడిన జయశ్యామ్.. తాజాగా విలేకరిపైనా దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.