రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అన్‌స్టాపబుల్ ప్రజల పార్టీ అని, జగన్ రెడ్డిది గాలి పార్టీ అని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది కేర్ అఫ్ అడ్రస్ లేని పార్టీ అని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన..ఎన్నికలకు మరో రెండేళ్లే ఉన్నందున నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉండి వారి సమస్యల పరిష్కరించాలని సూచించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు, వైకాపా నేతలకు సినిమా మొదలవుతోందని హెచ్చరించారు. అమెరికా వెళ్లినా, ఐవరీ కోస్ట్‌కు వెళ్లినా ఎవరినీ వదిలేది లేదని అన్నారు. తన తల్లిని అవమానించి బాధించిన వారెవరినీ విడిచిపెట్టనని తేల్చి చెప్పారు. తనపై హత్యాయత్నంతో పాటు 11 అక్రమ కేసులు పెట్టారని, తాను దేనికీ భయపడట్లేదు కార్యకర్తలు తెగించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
"విభజన తర్వాత బంగారు బాతు హైదరాబాద్‌ను కోల్పోయాం. హైదరాబాద్‌కు దీటుగా అమరావతి నిర్మాణం ప్రారంభించారు. ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని మన నినాదం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుదే. కంపెనీలను తరిమేసి యువతను నిరుద్యోగులుగా మారుస్తున్నారు. మహిళలకు పసుపు-కుంకుమ పథకం అమలు చేశాం. నాన్న బుడ్డితో మహిళల పసుపు-కుంకుమ వైకాపా తుడిచేస్తోంది. చెత్త పన్ను, ఇంటి పన్ను పేరిట ఆస్తులు జప్తు చేస్తున్నారు. తెదేపా కార్యకర్తల పార్టీ.. జగన్‌ది దొంగలు, డెకాయిట్ల పార్టీ. తెలుగుదేశం నేత విజనరీ.. వైకాపా నేత ప్రిజనరీ. జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు.. అందరినీ వేధిస్తున్నారు. ఇబ్బంది పెట్టిన వైకాపా నేతలకు సినిమా మొదలవుతోంది. నా తల్లిని అవమానించిన వారెవరినీ విడిచిపెట్టను."- లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
బడుగులకు అప్పుడే స్వాతంత్య్రం వచ్చింది: బడుగులకు 1982లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని నారా లోకేశ్ అన్నారు. సామాన్యులను నాయకులను చేసింది తెలుగుదేశం పార్టీనేనని వ్యాఖ్యానించారు. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ముందుకు సాగారన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కును తమ పార్టీ కల్పించిందన్నారు. పెద్ద ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. 1984లో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా తేేదేపా నిలిచిందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుకు ప్రధాని అవకాశాలు అనేకం వచ్చాయని తెలిపారు. అవకాశాలు వచ్చినా వారు ఏనాడు తెలుగు ప్రజలను వదిలిపెట్టలేదని లోకేశ్ అన్నారు.