ఏపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ (mp raghu rama krishna raju) పై వైకాపా ఎంపీలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ మీద... లోక్‌సభ స్పీకర్ (lok sabha speaker om prakash birla) ఓం ప్రకాశ్ బిర్లా స్పందించారు. పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రక్రియ ఉంటుందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. పరిశీలన తర్వాతే సభాహక్కుల కమిటీకి పంపిస్తామన్న ఆయన.. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని పేర్కొన్నారు. సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని తెలిపారు. రఘురామ అనర్హత పిటిషన్‌పై రన్నింగ్ కామెంటరీ చేయలేమని స్పీకర్ వ్యాఖ్యానించారు.
ఎంపీ రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ఎంపీలు ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి (vijaysai reddy) స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హత పిటిషన్ ఇచ్చి ఏడాది పూర్తైనా.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అనర్హత పిటిషన్‌లో ఎక్కడ సంతకాలు చేయలేదో వాటికి సంబంధించిన అదనపు వివరాలను జోడించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా తీవ్ర పదజాలం వాడుతూ ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తున్న కథనాల వివరాలను అందించినట్లు పేర్కొన్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని మరోసారి కోరినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.