లాక్‌డౌన్ మినహాయింపు సమయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటున్నారు. నాలుగు గంటల పాటు ప్రయాణానికి వెసులుబాటు కల్పించడం వల్ల సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు పెట్టేబేడా సర్ధుకుని బయలుదేరారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో సందడిగా మారిపోయాయి. ఒక్క బస్సు వచ్చినా.. ప్రయాణికులు పరుగెత్తుకుంటూ వచ్చి వాలిపోయారు. జిల్లాలకు వెళ్లే బస్సులతో పాటు, నగరంలో సైతం నాలుగు గంటలపాటు సిటీ బస్సులు తిరిగాయి. సిటీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు వారితో పోల్చితే.. తగ్గినట్లు ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రధాన ప్రాంతాలన్నింటిలో సిటీ బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. లాక్‌డౌన్ మినహాయింపు సమయం ముగియగానే సిటీ బస్సులన్నీ... ఆయా డిపోలకు చేరుకున్నాయి. పది గంటలలోపు జిల్లాలకు వెళ్లే బస్సులను ఆయా ప్రాంతాల వరకు చేరుకునే వరకు పోలీసులు అనుమతించారు.
అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు, ప్రైవేటు వాహనాలను సైతం పది గంటల తర్వాత అనుమతించడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర సర్వీసులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను లాక్‌డౌన్ సమయంలో నిలిపివేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి నడిపించే బస్సులను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే రద్దు చేసింది. ఏపీకి వెళ్లే కార్గో, కొరియర్ సర్వీసులను సైతం టీఎస్ఆర్టీసీ నిలిపివేసింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా బస్సులు నడపడంలేదు. రాష్ట్రంలోనూ కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే బస్సులు అందుబాటులో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణానికి ప్రణాళికలు వేసుకోవాలని ప్రయాణికులకు ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి. రైలు బయలుదేరే కంటే గంట ముందు మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. "లాక్‌డౌన్ వల్ల పోలీసులు బయట ఉండనివ్వడంలేదు. లోపలికి రైల్వే అధికారులు అనుమతించటం లేదు. దూర ప్రాంతాల నుంచి రావాలంటే.. ఏదో ఒక ప్రైవేట్ వాహనంలో రావాలి. కాబట్టి కొంచెం ముందుగానే రావాల్సి ఉంటుంది. అలా వస్తే... ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది" అంటూ రైల్వే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్లలో టికెట్ ఉన్న ప్రయాణికులను అనుమంతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.