కొన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధతో బోధనలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ప్రభుత్వం కానీ, అధికారులు గానీ ఆదేశించకపోయినా స్వచ్ఛందంగా జూమ్ యాప్ ద్వారా పాఠాలు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదో తరగతికి బోర్డు పరీక్షలు కావడంతో ఆ తరగతి విద్యార్థులపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ విధంగా రాష్ట్రంలోని దాదాపు 50 నుంచి 70 పాఠశాలల్లో ఈ తరహా బోధన సాగుతోంది. ఇలా ఒక బడిని చూసి మరో పాఠశాలలో ప్రారంభిస్తుండటంతో జూమ్ యాప్‌ను ఉపయోగించుకొని ఆన్‌లైన్ విద్యను అందించే బడుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
టీవీ పాఠాలకు అదనం..
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి కింది తరగతుల్లోని పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేందుకు దూరదర్శన్, టీశాట్‌లోని విద్య ఛానెల్ ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ టీవీ పాఠాలకు అదనంగా జూమ్ పాఠాలు కొనసాగుతున్నాయి.
జూమ్ తరగతులు నిర్వహిస్తున్న బడుల్లో కొన్ని...
- సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల
- ఆసిఫాబాద్ జిల్లా కూర ఉన్నత పాఠశాల
- నారాయణపేట జిల్లా కోస్గి మండలం బహర్‌పేట ఉన్నత పాఠశాల
- ఖమ్మం జిల్లా వేపకుంట్ల ఉన్నత పాఠశాల
- కరీంనగర్ జిల్లా ఆదర్శ పాఠశాల
- కరీంనగర్ గ్రామీణ మండలం నగునూర్.
- నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుడ్రంపల్లి
- కరీంనగర్ జిల్లా ముల్కనూర్
- పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ఉన్నత పాఠశాల
ఫోన్ లేకుంటే జత చేస్తున్నాం
మా పాఠశాలలో పదో తరగతిలో 190 మందికిపైగా ఉన్నారు. వారందరూ 12 గ్రామాలకు చెందిన వారు. వారిలో 90 మంది ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. లేని విద్యార్థులను సమీపంలో, అదే గ్రామంలో ఉన్న సహ విద్యార్థుల వద్దకు వెళ్లి జూమ్ యాప్ ద్వారా బోధించే పాఠాలు వినేలా ఏర్పాట్లు చేశాం. ఇంకా కొందరికి సమస్య ఉంది. వర్క్‌షీట్లు తయారు చేసి ఇస్తున్నాం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పర్యవేక్షిస్తున్నాం.
- నారాయణ, ప్రధానోపాధ్యాయుడు, కోస్గి హైస్కూల్