తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్‌ను గద్దె దించడమే సర్వాయి పాపన్నకు ఇచ్చే నివాళి అన్న లక్ష్మణ్

Laxman on KCR Government నిజాం తరహా పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించడమే సర్వాయి పాపన్నకు మనం ఇచ్చే ఘననివాళి అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్నకు నివాళి అర్పించిన లక్ష్మణ్, విజయశాంతితో కలిసి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Laxman on KCR Government
Laxman on KCR Government

By

Published : Aug 18, 2022, 1:35 PM IST

Updated : Aug 18, 2022, 2:05 PM IST

Laxman on KCR Government : తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటున్నామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తాడిచెట్టుపై పన్ను విధించిన నియంత పాలనపై పాపన్న వీరోచితంగా పోరాడారని తెలిపారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు.

Laxman on sarvayi papanna : హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విజయశాంతి, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, భాజపా శ్రేణులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని లక్ష్మణ్ విజయశాంతితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం.. పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా, కేంద్ర ఎన్నికల కమిటీ మెంబర్‌గా ఎన్నికైన లక్ష్మణ్‌ను భాజపా శ్రేణులు సన్మానించాయి.

"గోల్కొండ కోటగా సామ్రాజ్యాన్ని స్థాపించి బడుగుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న. తెలంగాణ గడ్డపై స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మహనీయుల త్యాగాల ఫలితమే. కానీ ఇప్పటి తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కేసీఆర్ సర్కార్‌పై యువత తిరగబడాల్సిన అవసరం ఉంది. భాజపా అండగా యువత పోరాటం చేసేందుకు ముందుకు రావాలి. కేసీఆర్ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలి. నిజాం తరహా పాలనను కేసీఆర్ కొనసాగిస్తున్నారు. కేసీఆర్ పాలనను భూస్థాపితం చేయడమే.. సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుంది." లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

Last Updated : Aug 18, 2022, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details