GODAVARI FLOODS: గోదావరి ఉద్ధృతి కారణంగా కోనసీమ జిల్లా రాజోలులో ఏటి గట్టుపై నుంచి వరద పొంగుతోంది. రాజోలులోని నున్నవారిబాడవ వద్ద.. గట్టుపై 3 అడుగులు ఎత్తు నీరు ప్రవహిస్తోంది. గట్టు వెంట ఉన్న 200 ఇళ్లు మునిగిపోయాయి. ఆయా నివాసాల ప్రజలు గట్టుపై గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రాజోలు, సోంపల్లి, శివకోటి గ్రామాల ప్రజలతో పాటు.. అధికారులు ఇసుక బస్తాలతో వరద అడ్డుకట్ట వేశారు
కోనసీమ జిల్లాలో ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయి. రాజోలులో 6చోట్ల ఏటిగట్లు బలహీనంగా మారాయి. గట్టుపై నుంచి వరద పొంగి ప్రవాహిస్తుండడంతో అధికారులు, స్థానికులు రాత్రంతా గట్టుపైనే కాపలా కాస్తూ ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు చేపట్టారు. ఉదయం వరద ఉద్ధృతి పెరగడంతో గట్టుపై రెండు అడుగులు ఎత్తు ఇసుక బస్తాలు వేశారు. రాజోలు వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు లౌడ్ స్పీకర్లు ద్వారా ప్రచారం చేశారు. రాజోలు, సోంపల్లి, శివకోటి గ్రామాల యువకులు, ప్రజాప్రతినిధులు గట్టు రక్షణకు చర్యలు చేపట్టారు.
మహోగ్ర గోదావరి.. మూడు దశాబ్ధాల తర్వాత లంక గ్రామాల ప్రజల్ని బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. ప్రతి ఏడాది వరదలానే భావించి అక్కడే ఉండిపోయిన లంకవాసులు ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక.. సర్వం కోల్పోయారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన, ఐ. పోలవరం, తాళ్లరేవు మండలాల్లోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంటిలోని వస్తువులను వరద నీటి నుంచి కాపాడుకునేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. పాడి పశువుల్ని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గూడు చెదిరిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.