పలుకు పరవశం.. మాట మాధుర్యం.. భావవ్యక్తీకరణ సుమధురం.. ఇదీ తెలుగు గొప్పతనం. బాధ.. ఆనందం.. సంతోషం.. భావోద్వేగం ఏదైనా అమ్మభాషే ఆధారం. రెండు శతాబ్దాల చరిత్ర గల కమ్మని భాష కాలప్రవాహంలో మిణుకు మిణుకు మంటోంది. పరభాష వ్యామోహం.. అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పోటీ వాతావరణంలో మాతృభాషను బతికించాలని.. భవిష్యత్ తరాలకు అందించాలని ఎంతోమంది తపిస్తున్నారు. తమవంతు తోడ్పాటును అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, సాంకేతికతను ఉపయోగించి యువతకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు వారివారి భాషల్లో మాట్లాడటాన్ని గర్వంగా భావిస్తుంటే తెలుగు వారు తెలుగులో మాట్లాడటం నామోషీగా భావించటం ఆందోళన కలిగిస్తుందంటున్నారు సాహితీవేత్తలు. మాతృభాష నేర్చుకుంటే ప్రోత్సహకాలు.. ప్రయోజనాలు అందించాలని సూచిస్తున్నారు. మాతృభాష కోసం పరితపించిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఆగస్టు 29ని ఏటా తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భాషాప్రేమికుల అంతరంగం.
30 తెలుగు ఖతులు
ఎంత అందమైన భాష అయినా వాడుకకు అనుకూలంగా లేనపుడు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మారుతున్న అవసరాలకు తగినట్టుగా దగ్గర చేసినపుడు ఆశయం సిద్ధిస్తుందని నటుడు, తెలుగుభాషాభిమాని అప్పాజీ అంబరీష దర్భా వివరించారు. అభిసారిక పత్రిక ఎడిటర్, ప్రచురణకర్తగా తండ్రి రాంషా బాటలో మాతృభాషపై అభిమానంతో తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ముద్రణరంగంలో ఉన్న అనుభవంతో తెలుగు ఖతులు(తెలుగు యూనికోడ్స్)ను తానే స్వయంగా తయారు చేసి అంతర్జాలంలో అందుబాటులో ఉంచారు. ముద్రణకు అనువుగా అందమైన అక్షరాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కొన్ని ఖతులను రూపొందించారు. ఇటీవల వేటూరి, సిరివెన్నెల పేర్లతో తెలుగు ఖతులను తయారు చేసి తెలుగువారికి చేరువ చేశారు. క్లౌడ్‌ఫండింగ్ ద్వారా వీటిని రూపొందించినట్లు చెప్పారు. సినీకవి ఆత్రేయ శతజయంతి సందర్భంగా ఆయన పేరుతో మరికొన్నింటిని ఆవిష్కరించనున్నట్లు వివరించారు. www.opentypefoundry.com వెబ్‌సైట్‌లో 30 తెలుగు ఖతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 22 వరకూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండు కీబోర్డులు అందుబాటులో ఉంచారు.
కథలు, కవితల పోటీలు పెట్టాలి
'వాడేవారు.. రాసేవారు.. చదివేవారు ఉన్నపుడు భాష కలకాలం వర్ధిల్లుతుంది. పాఠశాల స్థాయిలోనే కథలు, కవితల పోటీలు నిర్వహించాలి. దీని ద్వారా కొత్తతరం రచయితలు, కవులకు అవకాశాలు కలుగుతాయి. కొత్త తరం రచయితలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా దూరం తగ్గించవచ్ఛు నిత్యం వాడుక భాషలో ఉపయోగించే ఇంగ్లిషు, ఉర్దూ, సంస్కృత పదాలకు కొత్తపదాలు కనిపెట్టాలనేది మంచి ఆలోచన. కానీ వాటినే వినియోగించాలనే ఒత్తిడి తీసుకురాకపోవటం ఉత్తమం. న్యాయస్థాన తీర్పులు, నామఫలకాలు మాతృభాషలో ఉండాలి. ప్రభుత్వాల్లోనూ మార్పు రావాలి. విద్యావ్యవస్థల్లోనే ప్రోత్సాహకరమైన అడుగులు వేసినపుడు మన భాష చెక్కుచెదరకుండా ఉంటుంది.'