తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు సన్నాహాలు

తెలంగాణలో ప్రతి అంగుళాన్ని కచ్చితంగా కొలవడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. మార్చి నెల చివరిలో సమగ్ర భూ సర్వేను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Land survey using Differential Global Positioning System in telangana will starts from march
తెలంగాణలో మార్చిలో భూ సర్వే

By

Published : Feb 23, 2021, 6:52 AM IST

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను మార్చి నెల చివరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి అంగుళాన్నీ కచ్చితంగా కొలత వేయడానికి అవసరమైన పద్ధతులపై శరవేగంగా కసరత్తు జరుగుతోంది. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌తో (డీజీపీఎస్‌తో) సర్వే చేయనుండగా దానికన్నా ముందు చేయాల్సిన మ్యాపుల రూపకల్పన తదితర ప్రక్రియలకు సంబంధించిన విధానాలను సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు గుత్తేదారులకు సర్వే బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా టెండరు విధి విధానాలను రూపొందిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ సమగ్ర సర్వేపై పలు సూచనలు చేయగా, వాటి అమలుపై యంత్రాంగం దృష్టి సారించింది.

1.12 లక్షల చదరపు కిలోమీటర్లు

సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూములను పూర్తిగా సర్వే చేస్తారు. మొత్తం 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. చదరపు కిలోమీటరుకు కేంద్ర మార్గదర్శకాల మేరకు రూ.31 వేల నుంచి రూ.46 వేల వరకు వ్యయం అవుతుందనేది అంచనా. ప్రైవేటు గుత్తేదారులకు దీన్ని అప్పగించనుండటం, తక్కువ వ్యవధిలో సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఎక్కువ యంత్రాలు, నిపుణులను వినియోగించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల సర్వే వ్యయం చదరపు కిలోమీటరుకు రూ.50 వేలకు పైగా కూడా కావచ్చని అంచనా వేస్తున్నారు. ఒక వేళ మరింత తక్కువ సమయంలో సర్వే పూర్తి చేయాలని నిర్ణయిస్తే ఇది ఇంకా పెరగనుంది. దీని ప్రకారం సర్వేకు రమారమి రూ.550 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.

అందుబాటులో ఉన్న పద్ధతులెన్నో

తెలంగాణలో తొలి భూముల సర్వే 1934-36 మధ్య నిర్వహించారు. నాడు చేతి గొలుసులతో కొలతలు వేసి హద్దులు, విస్తీర్ణాన్ని నిర్ధారించారు. ఇప్పటికీ ఇవే కొనసాగుతున్నాయి. చాలా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో హద్దులు చెరిగిపోయాయి. చేతిరాత దస్త్రాల్లో దొర్లిన పొరపాట్లతో కొన్నిచోట్ల సాగులో ఉన్న యజమానుల వివరాలు మారాయి. హద్దులు తారుమారయ్యాయి. ప్రస్తుతం ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం డిజిటల్‌ సర్వే వైపు మొగ్గుచూపుతోంది. దీంతోపాటు స్థానికంగా ఉండే భూములను బట్టి అదనంగా మరికొన్ని రకాల సర్వే విధానాలను కూడా అనుసరించి మొదట ప్రాథమిక సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ సర్వేలకు వేర్వేరుగా టెండర్లు పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో..

దేశంలో సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ నిర్దేశించిన హద్దులు ఉన్నాయి. దేశాన్ని త్రికోణ పద్ధతిలో ఆ సంస్థ కొలత వేసి పలు స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టనున్న సర్వేలో ఈ స్టేషన్లను ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి గ్రామాల సరిహద్దులు గుర్తిస్తారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా శాటిలైట్‌ అనుసంధానిత హద్దులను ఏర్పాటు చేసి ప్రతి రైతు భూమికి కొలతలు వేస్తారు.

పలు సర్వే విధానాలు

*టోటల్‌ స్టేషన్‌ మాన్యువల్‌ విధానం

*లైడార్‌ స్కానింగ్‌ సర్వే

*ఏరియల్‌ ఫొటోగ్రఫీ విధానం

*డ్రోన్‌గ్రఫీ విధానం

*వెరీ హై రెజుల్యూషన్‌ శాటిలైట్‌ ఇమేజరీ

ABOUT THE AUTHOR

...view details