GO 111 News: జీవో 111 ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో... రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల చిరకాల వాంఛ 26 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా జీ+2 నిర్మాణాలకు అధికారులు అనుమతిస్తున్నారు. అవి కూడా గ్రామకంఠం పరిధిలో నిర్మించుకుంటేనే ఒప్పుకొంటున్నారు. ప్రస్తుతం ఆంక్షలు తొలగించడంతో ఇళ్ల నిర్మాణాలు జరిగి భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. రెసిడెన్షియల్ విల్లాలతో పాటు భారీ అపార్టుమెంట్లూ రానున్నాయి. హోటళ్లు, విలాస కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. అయితే ఈ జీవోపై ఉన్నత న్యాయస్థానాల్లో కేసులున్న నేపథ్యంలో వాటి ఆదేశాలపై అభివృద్ధి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కేసీఆర్ జీవో 111ను ఎత్తివేస్తామని చెప్పినప్పట్నుంచి ఆయా గ్రామాల్లో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉత్తర్వుల జారీతో వాటి రేట్లు విపరీతంగా పెరగనున్నాయి. ప్రస్తుతం మెయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాల్లో రహదారికి సమీపంలో ఎకరా రూ.4-10 కోట్ల మధ్య పలుకుతోంది. ఇప్పుడది రెండింతలు కానుందని చెబుతున్నారు. జీవో పరిధి గ్రామాల్లో 1,32,600 ఎకరాల భూములున్నట్లు అంచనా. ఇప్పటికే అధికారికంగా 450 వరకు లేఅవుట్లు వేశారు. అనధికారికంగా మరో 500 ఉంటాయని అంచనా. అలాగే 31,483 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
జీవో 111 పేరా 3లో ఏముందంటే..జీవో 111 పేరా 3లో పేర్కొన్న ఆంక్షలను తాజాగా సర్కారు ఎత్తివేసింది. వాస్తవానికి 111 జీవో కంటే ముందుగా 1994 మార్చి 31న జంట జలాశయాల పరిరక్షణకు జీవో 192 తీసుకువచ్చారు. అప్పట్లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా కొత్త నిబంధనలు తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం జీవో 111లోని పేరా 3లో ప్రకటించింది. దీని ప్రకారం..
* జలాశయాలకు ఉన్న పది కిలోమీటర్ల క్యాచ్‌మెంట్ ప్రాంత పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస సముదాయాలు, ఇతరత్రా నిర్మాణాలను నిషేధించింది. క్యాచ్‌మెంట్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో వేసే లేఅవుట్లలో 60 శాతం స్థలాలు ఓపెన్ స్థలాలు, రోడ్లకు కేటాయించాలి.
* మాస్టర్ ప్లాన్‌లోని 90శాతం ప్రాంతాన్ని రిక్రియేషన్, కన్జర్వేషన్ అవసరాలకు గుర్తించాలి.
* జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారక అవశేషాలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆరు నెలలకోసారి వాటి ఫలితాలపై జలమండలి అధికారులు సమీక్షించాలి.