నిండుకుంటున్న ఆక్సిజన్, ఐసీయూ పడకలు కరోనా తొలి వేవ్ తో పోలిస్తే రెండో వేవ్ ఉద్ధృతంగా విజృంభిస్తోంది. మహమ్మారి సోకిన వారిలో చాలామందికి ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల కొరత వెంటాడుతోంది. పలుకుబడి, డబ్బు చెల్లించే స్థోమత ఉన్నా... వెంటిలేటర్ దొరకటం కష్టంగా మారుతోంది. అయిన వారిని కాపాడుకునేందుకు బాధిత కుటుంబాలు ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొట్టినా... బెడ్ దొరకటం మహాభాగ్యంగా మారింది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ రోగుల కోసం 53వేల 575 పడకల్ని సిద్ధం చేశారు. అందులో సాధారణ పడకలు 21వేల 594, ఆక్సిజన్ పడకలు 20వేల 681, వెంటిలేటర్ సౌకర్యం కలిగినవి 11వేల 300 పడకలు ఉన్నాయి. ఇప్పటికే ఆక్సిజన్ పడకలు 14వేల430, ఐసీయూ పడకలు 8వేల392 నిండుకున్నాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి 69.7 శాతం ఆక్సిజన్, 74.2శాతం ఐసీయూ బెడ్స్‌పై ఇప్పటికే బాధితులు చికిత్స పొందుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 30 శాతం ఆక్సిజన్, 24శాతం ఐసీయూ బెడ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు పూర్తిగా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పడకలు ఖాళీగా లేవు
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచుతున్నట్టు సర్కారు చెబుతున్నా....అధికారిక లెక్కల ప్రకారం....జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేటలలో ఐసీయూ పడకలు ఒక్కటి కూడా ఖాళీలేని పరిస్థితి కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆక్సిజన్ పడకలు దాదాపు నిండుకున్నాయి. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12వందల55 ఆక్సిజన్ పడకలు కొవిడ్ రోగులకు కేటాయించగా... ప్రస్తుతం 84 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఒక వెయ్యి 93 ఐసీయూ బెడ్స్‌ని కేటాయించగా... ప్రస్తుతం 130 ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలో 600 ఆక్సిజన్ పడకలకు 580 బెడ్స్‌పై రోగులు చికిత్స పొందుతున్నారు. అక్కడ కేవలం 20 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కింగ్ కోటీలోనూ బెడ్స్ ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. నిమ్స్‌లోనూ ఒక్క ఆక్సిజన్, ఐసీయూ బెడ్ అందుబాటులో లేని దుస్థితి.
చికిత్స అందించినా..
రంగారెడ్డి జిల్లాలోని ఆస్పత్రుల్లో పడకల కొరత పెద్దగా లేనప్పటికీ.. టిమ్స్ ఆస్పత్రిలో మాత్రం పడకలు లేవు. టిమ్స్‌లో 843 ఆక్సిజన్ పడకలకు 575 బెడ్స్‌పై కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. కేవలం 268 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రిలో 137 ఐసీయూ పడకలు ఉండగా మొత్తం అన్నింటిపై రోగులు ఉన్నారు. గతంలో ఐసీయూ మీద కేవలం 4 నుంచి 5 రోజుల చికిత్సకే కొవిడ్ రోగులు కోలుకోగా... ప్రస్తుతం 15రోజులు పూర్తిగా ఐసీయూ చికిత్స అందించినా కోలుకోవడం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో లాక్డౌన్ 2.0... తాజా నిబంధనలు ఇవే..!