ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను చాటారు. పారిశుద్ధ్య కార్మికులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారంటూ ఓ విద్యార్థి తన పాఠశాలలో చెప్పిన కవితకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో ఉంచారు. ఈ వీడియోను జత చేస్తూ రతన్ టాటా పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను వివరిస్తూ వారిపై భారం తగ్గించేందుకు తాము చేస్తున్న కృషిని వివరించారు.
ముంబయిలో ప్రతిరోజూ 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. మిషన్ గరిమ ద్వారా కష్టపడి పనిచేసే వారిపై భారం తగ్గించడం, సురక్షితం పరిశుభ్రమైన, మానవీయ వాతావరణాన్ని కల్పించడానికి ‘టూబిన్స్ లైఫ్ విన్స్’ నినాదంతో టాటా ట్రస్టు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ వీడియోను తిలకించిన మంత్రి కేటీఆర్... పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత.. వ్యర్థాలను వేరు చేస్తున్న కార్మికులకు సాయం చేద్దాం... తడి, పొడి చెత్తను వేరు చేయాలి.... శ్రమ గౌరవాన్ని గుర్తించాలంటూ ట్వీట్ చేశారు. ముంబయిలోని పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా తమ ట్విటర్‌లో ఉంచిన వీడియోను అందరూ తిలకించాలి అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
రతన్‌టాటా జత చేసిన వీడియో సారాంశం
నా తండ్రి దేశాన్ని నడిపిస్తాడు..
ఆయన నాయకుడు కాదు.. అయినా దేశాన్ని దౌడు తీయిస్తాడు
ఆయన వైద్యుడు కాదు.. అయినా వ్యాధులను దూరం చేస్తాడు
ఆయన పోలీసు కాదు.. అయినా చెడును అడ్డుకుంటాడు
ఆయన సైనికుడు కాదు.. అయినా దేశంలోని దుష్ట శక్తులను పారదోలుతాడు
నా తండ్రి పనికి పోకపోతే.. దేశంలోని ఏ ఇల్లు సరిగా నడవదు
వంట కూడా వండుకోరు.. స్నానాలూ చేయరు
వీధుల్లో క్రిమికీటకాలు రాజ్యమేలుతాయి.. పిల్లలైతే పాఠశాలలకే వెళ్లరు