'దేశాన్ని ఉప్పెనలా ముంచేస్తున్న మతవాదం' - తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
తెలంగాణలో తరతరాలుగా మతభేదం లేకుండా జీవనం కొనసాగుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మన దేశంలో ప్రస్తుతం 'నాతో ఉంటే దేశభక్తుడివి లేకపోతే దేశ ద్రోహివి అన్న పరిస్థితులు ఉన్నాయని' ఆవేదన వ్యక్తం చేశారు.
లౌకిక వాదమంటే మతాన్ని రద్దు చేయడమో లేక మతాన్ని ముద్దు చేయడమో కాదని పరస్పరం ఒకరి విశ్వాసాలు, ఒకరి మతాలను మరొకరు గౌరవిస్తూ కలిసి మనుగడ సాధించడమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్శిటీలో తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాన్ని మతవాదం ఉప్పెనలా ముంచేస్తోందని, అది ఉన్మాదానికి దారితీయకముందే నియంత్రించాలని సూచించారు. ప్రస్తుతం మన దేశ పరిస్థితులను బట్టి తర్కించి విభేదించకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో మతం, జాతీయవాదం రాజకీయాలతో పెనవేసుకుపోయామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
- ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం