హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది.
34: 66 నిష్పత్తిలో కృష్ణా జలాలు
కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. అనుమతులు తీసుకుని డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరురాష్ట్రాలు అంగీకరించాయని బోర్డు తెలిపింది. తెలంగాణ, ఏపీ.. 34: 66 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతాంశంగా పరిగణించి అమలు చేసేందుకు అంగీకరించాయని బోర్డు పేర్కొంది.
తాగునీటి వినియోగం 20 శాతమే..
శ్రీశైలం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తికి వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలని అంగీకరించాయని కృష్ణా బోర్డు వెల్లడించింది. వరద సమయంలో ఉపయోగించిన జలాల అంశాలను కమిటీ పరిశీలిస్తోందని పేర్కొంది. తాగునీటి వినియోగం 20 శాతమే లెక్కింపుపై జలసంఘానికి నివేదించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని బోర్డు తెలిపింది.
ఏపీలో గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించిన జలాల అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదించినట్లు ఛైర్మన్ పరమేశం తెలిపారు. ఏపీ రాజధానికి కృష్ణా బోర్డు తరలింపు విషయంపై కేంద్ర జల్‌శక్తి శాఖదే నిర్ణయమని స్పష్టం చేశారు.
అదనపు జలాలు ఇవ్వండి
కృష్ణా బోర్డు సమావేశంలో రాష్ట్ర వాదనను సమర్ధంగా వినిపించినట్లు జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. తాగునీటి కేటాయింపులను 20శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణాకు మళ్లింపుపైనా బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. తెలంగాణకు అదనపు జలాలు ఇవ్వాలని కోరామన్నారు.