RDS Canal: ఆర్డీఎస్ పథకం కింద 15.9 టీఎంసీల నీటి కేటాయింపుతో 87,500 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉన్నా.. ఆచరణలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందని తెలంగాణ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. దీనిపై బోర్డు ప్రత్యేక అధికారి రవికుమార్ పిళ్లై ఆధ్వర్యంలో ఓ బృందం ఆర్డీఎస్‌తో పాటు తుంగభద్రపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఆయకట్టుకు సక్రమంగా నీరందేందుకు పలు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. దీంతో ఆర్డీఎస్, తుంగభద్ర నీటి వినియోగంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రోడ్‌మ్యాప్‌ను తయారు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు పంపింది.
RDS Canal:'ఆర్డీఎస్ కాలువను ఆధునికీకరించాలి'.. కృష్ణా బోర్డు సూచన - కృష్ణా బోర్డు సూచన
RDS Canal: రాజోలిబండ నీటి మళ్లింపు పథకం(ఆర్డీఎస్) కాలువ, హెడ్ రెగ్యులేటర్‌ను ఆధునికీకరించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. కేటాయింపులకు తగ్గట్టుగా నీటి వినియోగం జరిగేలా చూడటానికి రోడ్‌మ్యాప్‌ను తయారుచేసింది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక కూడా అంగీకారం తెలిపినట్లు బోర్డు వెల్లడించింది.
Krishna board instructed telangana government that rds canal needs to be modernized
బోర్డు రోడ్‌మ్యాప్ ప్రకారం..
- ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్‌కు కొన్ని మార్పులు చేయాలి. నదిలో ప్రవాహం తక్కువగా ఉండి తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేసినపుడు రెండు రకాల పద్ధతులను అవలంబించాలి. ఆర్డీఎస్ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద డిజైన్ సామర్థ్యం 850 క్యూసెక్కులు. హెడ్ రెగ్యులేటర్ వద్ద, దిగువన ఆనకట్ట వద్ద 7:10 నిష్పత్తిలో నీటి ప్రవాహం ఉండాలి. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఎలాంటి మార్పులు చేయాలనేది నిర్ణయించడానికి పుణెలోని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధన కేంద్రానికి బాధ్యత అప్పగించాలి. ఆరు నెలల్లో ఈ అధ్యయనం పూర్తి కావాలి. ఇందుకయ్యే ఖర్చును మూడు రాష్ట్రాలు భరించాలి.
- కాలువ, హెడ్ రెగ్యులేటర్ వద్ద 850 క్యూసెక్కుల ప్రవాహం ఉండటానికి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ప్రస్తుతం ఉన్న నిల్వ సామర్థ్యం సరిపోతుందో లేదో చూడాలి. అసలు ఆకృతిని పరిగణనలోకి తీసుకోవాలి.
- నదిలో ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల 500 నుంచి 6 వేల క్యూసెక్కులు ఉండాలి. నీటి విడుదలకు అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఇండెంట్ ఇవ్వాలి. తుంగభద్ర బోర్డు టెలిమెట్రీ వ్యవస్థతో ఆర్డీఎస్‌ను అనుసంధానించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
- అధ్యయనం ఆధారంగా చేపట్టే ఆధునికీకరణ పనులు కర్ణాటక ప్రభుత్వం ద్వారా చేయించాలి.
- వచ్చే జూన్ నుంచి కొత్త మార్పులను అమలు చేయాలి. ఇందులో భాగంగా ఆర్డీఎస్ కాలువకు నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్వహణను నిలిపివేయాలి. కృష్ణా ట్రైబ్యునల్-2 అవార్డు వచ్చేవరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ పంపింగ్‌ను ప్రారంభించవద్దు. కుడి ప్రధాన కాలువ పనిని ఆంధ్రప్రదేశ్ చేపట్టకూడదు.
- డ్యాంలో నీటి నిల్వ, లభ్యతను బట్టి వానాకాలం(ఖరీఫ్), యాసంగి(రబీ) సీజన్‌లలో ఏ రాష్ట్రానికి ఎంత నీరు అందుబాటులో ఉంటుందో తుంగభద్ర బోర్డు సమాచారమివ్వాలి.
- కేసీ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేయాల్సిన 10 టీఎంసీల్లో రెండు టీఎంసీలను అక్టోబరు 31లోగా విడుదల చేయాలి. డ్యాంలో నిల్వ ఆధారంగా తక్కువ నీటి వాటా వస్తే ఆ విషయంపై ముందుగానే సమాచారం ఇవ్వాలి.
ఇదీ చూడండి: