ఆంధ్రప్రదేశ్‌కు న్యాయంగా రావాల్సిన నీటి హక్కులను సీఎం జగన్.. తెలంగాణకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 ప్రాజెక్టులను నిర్మిస్తుంటే ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తైతే... దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ సర్కార్ పాలమూరు, రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కొల్లు వివరించారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్యబోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని, బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు లేవని ఆరోపించారు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రాజెక్టులు నిర్మిస్తుంటే... జగన్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మాజీ మంత్రి నిలదీశారు.
కేంద్రం ధృతరాష్ట్రుడి పాత్ర...
కేంద్రం ఎందుకు ధ్రుతరాష్ట్రుడి పాత్ర పోషిస్తోందని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వెంటనే కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేసి తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.
రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలన్న కృష్ణా బోర్డు...
ఆంధ్రప్రదేశ్ నేతలు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తున్న తరుణంలో... ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కొనసాగించవద్దని కృష్ణానదీ యాజమన్య బోర్డు మరోమారు జగన్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. డీపీఆర్ సమర్పించకుండా... అత్యున్నత మండలి అనుమతి లేకుండా... ముందుకెళ్లొద్దని తెలిపింది. ఎలాంటి అనుమతులు లేకుండా...జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని.. తెలంగాణ సర్కార్ చేసిన ఫిర్యాదుపై బోర్డు స్పందించింది. ఈ మేరకు.... కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా.. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.
ఇదీ చూడండి:Niranjan Reddy: ఇకనైనా అక్రమ ప్రాజెక్టులను ఆపండి... లేకుంటే చూస్తూ ఊరుకోం