అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఆలయం మహరాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి సన్నిధి. మన దేశంలో ఉన్న అన్ని మహాలక్ష్మి ఆలయాలతో పోలిస్తే... ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉందని అంటారు. సతీదేవి నయనాలు ఇక్కడ పడ్డాయనీ... అందుకే ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటనీ చెబతారు. సుమారు ఆరువేల ఏళ్ల క్రితం నుంచీ ఈ ఆలయం ఉన్నా దీన్ని ఎప్పుడు ఎవరు కట్టారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. పంచగంగ నదీ ఒడ్డున ఉన్న ఈ అమ్మవారిని జగద్గురువు ఆదిశంకరాచార్యులూ, ఛత్రపతి శివాజీతోపాటూ ఎందరో రాజులు దర్శించుకున్నట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ కొలువైన మహాలక్ష్మిని కర్‌వీర్ మహాలక్ష్మి, లక్ష్మీభవాని, అంబాబాయిగా కొలుస్తారు భక్తులు.
స్థలపురాణం
ప్రళయకాలం సంభవించినప్పుడు పరమశివుడు కాశీక్షేత్రాన్ని కాపాడినట్లుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి కూడా తన చేతులతో ఈ ప్రాంతాన్ని ఎత్తి కాపాడిందని అంటారు. అందుకే ఇక్కడ అమ్మవారిని కరవీర మహాలక్ష్మిగానూ పిలుస్తారు భక్తులు. ఓసారి భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు వచ్చాడట. విష్ణుమూర్తి మహర్షి రాకను గమనించలేదట. దాంతో ఆగ్రహించిన ఆ రుషి విష్ణుమూర్తి వక్షస్థలంపైన తన్నడంతో... తాను కొలువై ఉండే వక్షస్థల భాగాన్ని ఓ ముని తన కాలితో తాకడాన్ని సహించలేని లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసిందనీ... ఆ తరువాత ఇక్కడే ఉండిపోయిందనీ అంటారు. అలాగే సతీదేవి దేహాన్ని చేతబట్టి శివుడు ప్రళయ తాండవం చేసినప్పుడు ఖండితమైన ఆమె శరీర భాగాలలో నయనాలు ఇక్కడ పడ్డాయనీ... అలా అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిసిందనీ మరో కథా ప్రాచుర్యంలో ఉంది. అయితే ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న ఆలయం ఉండేదట. ఓసారి కర్ణ్‌దేవ్ అనే రాజు కొంకణ్ ప్రాంతం నుంచి కొల్హాపూర్ వచ్చినప్పుడు ఈ అడవిలో ఉన్న ఆలయాన్ని చూసి... చుట్టూ ఉన్న చెట్లను నరికించి... ఈ గుడిని వెలుగులోకి తెచ్చాడని చెబుతారు. ఆ తరువాత కాలక్రమంలో ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఓసారి అగస్త్య ముని... కాశీకి ప్రత్యామ్నాయంగా మరో పుణ్యక్షేత్రాన్ని చూపించమని పరమశివుడిని అడిగాడట. దాంతో శివుడు కొల్హాపూర్‌ని చూపించాడనీ... ఈ ఆలయానికి వెళ్తే కాశీని దర్శించుకున్న పుణ్యం లభిస్తుందనీ దేవీ భాగవతంతోపాటూ పద్మ, స్కంద, తదితర పద్దెనిమిది పురాణాల్లో ప్రస్తావించబడిందనీ చెబుతారు.