తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్‌ మోసాలు ఇక చెల్లవు.. తెలంగాణలో మరింత బలపడతాం.. అధికారం చేపడతాం.. - కిషన్​రెడ్డి తాజా వార్తలు

kishan reddy interview: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పోయి మోదీ తరహా పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వారి ఆశీస్సులతో తెలంగాణలో మరింత బలపడి అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ మోసాలు ఇక చెల్లవని పేర్కొన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కిషన్​రెడ్డి 'ఈటీవీ భారత్' ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

kishan reddy
kishan reddy

By

Published : Jul 1, 2022, 4:16 AM IST

kishan reddy interview: తెలంగాణలో కేసీఆర్‌ సర్కారు పోయి మోదీ తరహా పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వారి ఆశీస్సులతో రాష్ట్రంలో మరింత బలపడి అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ మోసాలు ఇక చెల్లవని పేర్కొన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, యూపీ, బిహార్‌, తమిళనాడు, కశ్మీర్‌, ఏపీ వంటి రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా భాజపా పోరాడుతోందని, ఈ తరహా పాలనకు చరమగీతం పాడాలన్నదే తమ లక్ష్యమని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. దక్షిణాదిలో కర్ణాటకలో భాజపా అధికారంలో ఉంది. పుదుచ్చేరిలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మిగతా రాష్ట్రాలపైనా జాతీయ నాయకత్వం దృష్టి సారించిందని తెలిపారు. తెలంగాణలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, జాతీయ పార్టీ నుంచి అవసరమైన సహకారం, సలహాలు అందుతున్నాయని చెప్పారు. గుజరాత్‌ పేరుతో తెరాస అర్థరహిత విమర్శలు చేస్తోందన్నారు. మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ దేశానికి ఎంతో మేలు చేశారని, ఆ ఇద్దరి స్ఫూర్తితో ప్రధాని మోదీ దేశహితం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చించబోతున్నారు

కేంద్ర ప్రభుత్వ పనితీరుపై పార్టీ చర్చించి అవసరమైన సలహాలిస్తుంది. దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై.. ప్రధానంగా గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సహా రానున్న రాష్ట్రాల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది.

సమావేశాలకు వచ్చే నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లడం వెనుక రాజకీయ కారణాలున్నాయా

క్షేత్రస్థాయిలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు, కేంద్ర పథకాల లబ్ధి గురించి.. వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుంటారు. పార్టీకి, కేంద్రంలో ప్రభుత్వానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెడతారు.

పలు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా దక్షిణాదిలో బలహీనంగా ఉండటానికి కారణాలేంటి

కర్ణాటకలో అధికారంలో, పుదుచ్చేరిలో సంకీర్ణ సర్కారు భాగస్వామిగా ఉన్నాం. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణ, ఏపీలోనూ బలపడతాం. కేరళలో కొంత సమయం పడుతుంది.

భాజపా, తెరాస మధ్య అవగాహన ఉందన్న కాంగ్రెస్‌ విమర్శలపై ఏమంటారు

భాజపా ఏనాడూ తెరాస, కాంగ్రెస్‌తో కలవలేదు. కాంగ్రెసే.. తెదేపా, తెరాస, కమ్యూనిస్టులతో కలిసింది. మాకు ఆ అవసరం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ రోజురోజుకు పతనమవుతోంది. దీనిపై నుంచి దృష్టి మళ్లించడానికే భాజపాపై విమర్శలు చేస్తోంది. దేశమంతా కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తెరాసతో ఎట్టి పరిస్థితుల్లో కలవం.

కేంద్రంలో ఎనిమిదేళ్ల భాజపా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నారా

భాజపా సమర్థంగా పనిచేస్తోంది. నీతి, నిజాయతీతో పాలన అందిస్తోంది. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. ఐఎస్‌ఐ ఉగ్రవాదాన్ని అరికట్టాం. అమెరికా, చైనా కంటే మన ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. యూపీ, మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఫలితాలు మా పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి నిదర్శనం. యూపీలో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి బలమున్న స్థానాల్లో విజయం సాధించాం. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో ముస్లిం మహిళలు భాజపాకు ఓటేశారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, రామజన్మభూమి వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలు మద్దతు పలికారు. ప్రపంచంలో భారత్‌కు మోదీ ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

రాష్ట్రం నుంచి అధిక ఆదాయం వెళ్తున్నా కేంద్రం తక్కువగా ఇస్తోందని కేటీఆర్‌ విమర్శిస్తున్నారు..

యూపీఏలో కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి విధానమే కొనసాగుతోంది. కేంద్ర నిధుల్లో రాష్ట్రాలకు ఇచ్చే 32 శాతం నిధుల్ని మోదీ 42 శాతానికి పెంచారు. వెనుకబడిన యూపీ, బిహార్‌ వంటి రాష్ట్రాలకు చేయూత అందించాలి. కేంద్రం నుంచి కరోనా వ్యాక్సిన్లు, రుణాలు, బియ్యం.. తెలంగాణ ప్రజలకు రావట్లేదా? కల్వకుంట్ల కుటంబానికి నిధులిస్తేనే తెలంగాణకు ఇచ్చినట్లా? రాష్ట్రంలో ఎరువుల కర్మాగారం పెట్టాం. అందరం భారతీయులమే అన్న విషయాన్ని తెరాస మర్చిపోయి విమర్శలు చేస్తోంది. పంచాయతీల్లో కేంద్ర నిధులతోనే వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు.

ఎస్సీ వర్గీకరణ అంశానికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది

భాజపా కేంద్ర నాయకత్వం గతంలో మద్దతు ప్రకటించింది. చర్చలు జరుపుతున్నాం. వర్గీకరణ విషయంలో న్యాయం జరుగుతుంది.

భాజపా బలం పెరుగుతోందా.. తగ్గుతోందా..

హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లలో పార్టీ బలహీనంగా ఉండటంతో ఓడిపోయాం. దళిత బంధు పథకాన్ని తెరాస తెచ్చినా హుజూరాబాద్‌లో భాజపా విజయాన్ని ఆపలేకపోయింది. ఈటల బలమైన నాయకుడు కావడంతో గెలిచాం. దుబ్బాకలో గెలుపు, గ్రేటర్‌లో మంచి ఫలితాలు.. రాష్ట్రంలో అధికారం దిశగా తీసుకెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. తెరాసకు గుణపాఠం తప్పదు. కేసీఆర్‌ ఎనిమిదేళ్లుగా మోసాలు చేస్తున్నారు. ఇక కల్వకుంట్ల కుటుంబం మాటలను ప్రజలు నమ్మరు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తొలిరోజే మాటతప్పారు. ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి.. ఇలా ఎన్నో విషయాల్లో మోసం చేశారు.

ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్న కేంద్రం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు మంజూరు నిలిపివేయడంపై ఏమంటారు

చంద్రబాబు హయాంలో ఏపీలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. తెలంగాణలో రెండున్నర లక్షల ఇళ్ల పేరుతో ఎనిమిదేళ్లుగా మభ్యపెడుతున్నారు. కట్టినవి కొన్ని వేలే. అవి కూడా తెరాస కార్యకర్తలకే తప్ప.. పేదలకు ఇవ్వట్లేదు. నెలల వ్యవధిలోనే అధికారిక నివాసం కట్టుకున్న, కొత్త సచివాలయం పూర్తి చేస్తున్న కేసీఆర్‌.. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ఎనిమిదేళ్లయినా ఎందుకు పూర్తి చేయట్లేదు? అనేక రాష్ట్రాల్లో ఒకేసారి 10 లక్షల ఇళ్లను పేదలకు పంచుతున్నారు.

హైదరాబాద్‌పై భాజపా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుంది..

హైదరాబాద్‌లో దాదాపు 30 శాతం జనాభా, 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. మజ్లిస్‌ కారణంగా హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతోంది. హైదరాబాద్‌ను మజ్లిస్‌కు అప్పగించాలని తెరాస చూస్తోంది. ఇప్పటికే పాతబస్తీని వారికి రాసిచ్చారు. మంత్రులు కూడా మజ్లిస్‌ అనుమతి లేకుండా అక్కడ తిరిగే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ మజ్లిస్‌ చేజిక్కకుండా అడ్డుకుంటాం. కొత్త నగరాన్ని వారి చేతుల్లోకి పోకుండా శక్తిమేరకు ప్రయత్నిస్తాం.

కేంద్రం నిధులపై తెరాసది తొండి వాదన. హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదాయం ఎంత.. ఇక్కడ చేసే ఖర్చెంతని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతారు? కేంద్రానికి వచ్చే ఆదాయాన్ని నరేంద్ర మోదీ దుర్వినియోగం చేశారా? నీటిపారుదల ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నారా? కుటుంబ ఆస్తులు పెంచుకున్నారా? ప్రజల డబ్బును ప్రజల కోసం కొంత కేంద్రం, కొంత రాష్ట్రాలు ఖర్చు చేయాలి. ఇందులోనూ రాజకీయాలా?

ఆత్మగౌరవం కోసం పోరాటం తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. నిజాంకు వ్యతిరేకంగా మొదలుకుని రాష్ట్ర సాధన వరకు పోరాడారు. తెలంగాణలో తండ్రీకుమారుల నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు. అధికారం కల్వకుంట్ల కుటుంబ చేతిలో కేంద్రీకృతమైంది. ప్రజల్ని, ప్రజాసంఘాల్ని సీఎం ఏరోజూ కలవలేదు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details