UDDANAM KIDNEY VICTIMS : ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే సీఎం జగన్.. పలాసలో 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 50 కోట్ల అంచనా వ్యయంతో.. రెండేళ్లలో పూర్తి స్థాయిలో రోగులకోసం అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసి మూడేళ్లయినా.. ఇంకా నిర్మాణం సాగుతూనే ఉంది. ఈ ఆస్పత్రి వస్తుందని.. బాధలు తీరతాయని భావించిన కిడ్నీ రోగులకు నిరాశే ఎదురవుతోంది.
ఉద్దానం ప్రాంతంలో 10 వేల మందికి పైగా ప్రజలు కిడ్నీ బారిన పడ్డారు. బాధితులంతా గ్రామాల్లో నివసించే పేదవారు కావడం వల్ల వైద్య ఖర్చులు భరించలేక.. కుటుంబాలన్నీ చిన్నాభిన్నమవుతున్నాయి. విశాఖ , శ్రీకాకుళం వైద్యం కోసం వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతోంది. దీంతో బాధితులు అప్పుల పాలవుతున్నారు.
"200 పడకల ఆసుపత్రులు అన్నారు. ఇంతవరకు నిర్మాణం కాలేదు. వైద్యం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆసుపత్రిని కడితే కనీసం ఖర్చు అయినా తగ్గుతుంది. ఆసుపత్రిలో వైద్యం కోసం ఇల్లు, పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలు ఎందుకు సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రి నిర్మాణం చేపడితే చాలా మందికి మేలు చేసిన వారు అవుతారు"-కిడ్నీ బాధితులు