తెలంగాణ

telangana

ETV Bharat / city

చాపకింద నీరులా వ్యాపిస్తున్న కిడ్నీ వ్యాధులు - kidney failure cases in hyderabad

మూత్రపిండాల వైఫల్య వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. గత దశాబ్ద కాలంలో దేశంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ఏటా లక్ష మంది కొత్తగా మూత్రపిండాల వైఫల్య బారిన పడుతుండగా.. రాష్ట్రంలో సుమారు 3 వేల మంది బాధితులు నమోదవుతున్నట్లు అంచనా. దేశంలో ఏటా 1.36 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో మృతి చెందుతుండగా.. రాష్ట్రంలో 2 వేలకుపైగా రోగులు ఈ వ్యాధితో మృత్యువాత పడుతున్నారు.

kidney failure cases increases day by day in india
చాపకింద నీరులా వ్యాపిస్తున్న కిడ్నీ వ్యాధులు

By

Published : Jan 20, 2020, 8:30 AM IST

కిడ్నీ వైఫల్య వ్యాధి అతివేగంగా వ్యాపిస్తోంది. గత పదేళ్లలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కిడ్నీ వైఫల్యానికి అధిక రక్తపోటు, మధుమేహం 60 శాతం కారణాలవుతుండగా.. గుర్తించకుండా మరో 40 శాతం వైఫల్యాలు ఉన్నాయి.

దేశంలో ఏటా లక్ష మంది కొత్తగా మూత్రపిండాల వైఫల్య బారిన పడుతుండగా.. రాష్ట్రంలో సుమారు 3 వేల మంది బాధితులు నమోదవుతున్నట్లు అంచనా. దేశంలో ఏటా 1.36 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో మృతి చెందుతుండగా.. రాష్ట్రంలో 2 వేలకుపైగా రోగులు ఈ వ్యాధితో మృత్యువాత పడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో 2016లో మంచాన బారిన పడి చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తుల్లో మూత్రపిండాల వైఫల్యం చెందిన వారు 16వ స్థానంలో ఉండగా.. ఈ ధోరణి 2040 నాటికి ఐదో స్థానానికి చేరుకునే ప్రమాదముందని తెలిపింది. ఈ పరిస్థితిని నివారించాలంటే తక్షణమే మూత్రపిండాల వైఫల్యాలపై దృష్టి పెట్టాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లో జరుగిన మూత్రపిండాల వైద్యనిపుణుల సదస్సు ముగింపు రోజున పలు కీలక తీర్మానాలు చేశారు.

కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాలు...

  • మధుమేహం 30 శాతం.. అధిక రక్తపోటు 30 శాతం
  • మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లు, పుట్టుకతో వచ్చే జబ్బుల వంటివి 20శాతం
  • ఎండదెబ్బ, తాగునీరు, నొప్పి మాత్రలు, ఇతర కారణలేవీ తెలియనివి 20శాతం

లక్షణాలు :

  • మూత్రపిండాల వైఫల్యాన్ని ఐదు దశలుగా విభజిస్తే..
  1. మొదటి దశలో(10శాతం దెబ్బతిన్నప్పుడు) అసలు లక్షణాలేమీ తెలియవు.
  2. రెండో దశలో (20-40శాతం దెబ్బతిన్నప్పుడు) అధిక రక్తపోటు, మూత్రంలో ప్రొటీన్‌ వెళ్లిపోవడం
  3. మూడో దశలో (40-70 శాతం దెబ్బతిన్నప్పుడు) రక్తహీనత, ఎముకలు బలహీనపడడం.. ఈ దశలో రక్తంలో పరీక్షలు చేస్తే క్రియేటినిన్‌ పెరగడం గుర్తించొచ్చు.
  4. నాలుగో దశలో (70-85శాతం దెబ్బతిన్నప్పుడు) కాళ్ల వాపులు, తలనొప్పి
  5. ఐదో దశలో 85శాతానికి కంటే ఎక్కువగా పని చేయనప్పుడు.. రక్త శుద్ధి అవసరమవుతుంది. లేదా మూత్రపిండాల మార్పిడి చేయాలి.

తొలి దశలో గుర్తింపు ప్రధానం

  • సాధారణంగా ఐదో దశకు చేరుకోవడానికి సుమారుగా 5-6 ఏళ్లు పడుతుంది.
  • ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల రాళ్ల వల్ల వైఫల్యం ఏర్పడితే ఏడాదిలోనే ఆఖరి దశకు రావచ్చు.
  • నెఫ్రొటిక్‌ సిండ్రోమ్‌ వంటి జబ్బుల్లో 10-15 ఏళ్లు కూడా పట్టొచ్చు.
  • నొప్పి మాత్రలు వాడటం వల్ల ఐదారేళ్లలోనే ఐదో దశకు చేరుకుంటారు.
  • ఆఖరి దశకు చేరే సరికి 80శాతానికి పైగా మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నాయి.

నివారణపై దృష్టిపెట్టాలి

"మూత్రపిండాల వైఫల్యానికి పలు కారణాలున్నా ఇప్పుడు తాజా పరిశోధనల్లో కలుషిత నీరు, ఎండవేడిమిలో ఎక్కువగా పనిచేయడం వంటివి కారణాలుగా కనుగొన్నారు. అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించాలి. బోరు నీటి కంటే ఉపరితల నీటిని తాగడానికే ప్రాధాన్యమివ్వాలి. "
- డాక్టర్‌ ఆచార్య దక్షిణమూర్తి, ప్రముఖ నెఫ్రాలజిస్టు

ABOUT THE AUTHOR

...view details