భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా ఈ నెల 22న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వజ్రోత్సవ కమిటీ ఛైర్మన్, ఎంపీ కె.కేశవరావు తెలిపారు. బీఆర్కే భవన్‌లో ఆయన అధ్యక్షతన స్వతంత్ర వజ్రోత్సవాల కమిటీ ముగింపు సమావేశం జరిగింది. ఈ నెల 22న ప్రభుత్వం వైభవంగా చేపట్టనున్న వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 8వ తేదీ నుంచి జరుగుతున్న నిర్వహిస్తున్న భారత స్వతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులను కేకే అభినందించారు.
ఈ నెల 21వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నామని కేకే ప్రకటించారు. 22న ఎల్‌బీ స్టేడియంలో జరిగే ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్, దీపికారెడ్డి బృందం నృత్యం, తెలంగాణా జానపద కళా రూపాలు, లేజర్ షో వంటి ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున క్రాకర్స్ ప్రదర్శన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి వెల్లివిరిసేలా ఉంటాయని వెల్లడించారు. పూర్తి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయనేది జీఏడీ కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 20 వేలకు పైగా ప్రజలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.