Kerala Tourism: ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, వైవిధ్యమైన పర్యాటక పరవశాన్ని పొందేందుకు... కేరళ సరైన గమ్యస్థానమని ఆ రాష్ట్ర టూరిజం డైరెక్టర్ కృష్ణతేజ పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా.. కేరళలో కారవాన్ టూరిజం, వాటర్ టూరిజం, అడ్వెంచర్స్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. అన్ని వయసుల వారికీ ఆనందాన్ని పంచేలా విభిన్న సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. కరోనా అనంతరం అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ కేరళ టూరిజంను ప్రమోట్ చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో టూరిజం రోడ్ షో నిర్వహించారు.
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త ఆవిష్కరణలు చేసిందని కృష్ణతేజ వెల్లడించారు. పర్యాటకులు తమ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ఉండేందుకు... కొత్త టూరిజం స్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని బీచ్‌లు, హిల్ స్టేషన్లు, హౌజ్‌బోట్ వంటి అత్యాధునిక సదుపాయాలు.. ఏడాది పొడవునా పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాబోయే ఏడాది టూరిజంలో కేరళ ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షించే అవకాశాలున్నాయని కృష్ణతేజ వెల్లడించారు. ఈ ఏడాదిలో కేరళలో ట్రావెల్ మార్ట్, ఛాంపియన్స్ టోట్‌లీగ్ వంటి సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలు జరగబోతున్నాయని వివరించారు.