తెలంగాణ

telangana

ETV Bharat / city

సచివాలయ ప్రాంగణంలో 3 ప్రార్థనా మందిరాలు: కేసీఆర్​ - owaisi brothers meet kcr

'తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. పరమత సహనాన్ని పాటిస్తుంది. గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా నూతన సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

kcr
సచివాలయ ప్రాంగణంలో 3 ప్రార్థనా మందిరాలు: కేసీఆర్​

By

Published : Sep 6, 2020, 8:11 AM IST

సచివాలయంలో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో సీఎం ప్రగతిభవన్‌లో శనివారం సమావేశమయ్యారు. ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేత సందర్భంగా ఆలయం, రెండు మసీదులకు నష్టం వాటిల్లిందన్నారు. అన్ని సౌకర్యాలతో వాటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒక్కొక్కటి 750 చదరపు గజాల విస్తీర్ణంలో ఇమామ్‌ క్వార్టర్‌తోసహా రెండు మసీదులను మునుపటి స్థలంలోనే నిర్మించి వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. 1,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఆలయాన్ని కట్టి దేవాదాయ శాఖకు అప్పగిస్తామని తెలిపారు. క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వమే నిర్మిస్తుందని పేర్కొన్నారు.

సమావేశాల తరువాత శంకుస్థాపన

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మూడింటికీ ఒకే రోజు శంకుస్థాపన చేస్తాం. ముస్లిం అనాథ పిల్లలకు విద్య నేర్పించే అనీస్‌-ఉల్‌-గుర్భా నిర్మాణం 80 శాతం పూర్తయింది. మరో రూ.18 కోట్లు త్వరలో విడుదల చేసి నిర్మాణాన్ని త్వరితంగా పూర్తి చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్‌ సెంటర్‌ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేశాం. తక్షణం పనులు ప్రారంభిస్తాం.

150-200 ఎకరాల్లో ఖబర్‌స్థాన్‌లు

హైదరాబాద్‌ చుట్టూ ఖబర్‌స్థాన్‌ల అవసరం ఉంది. వాటి ఏర్పాటు కోసం స్థలాలను సేకరించాలని రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లను కోరాం. కొన్ని స్థలాలు గుర్తించారు. 150 నుంచి 200 ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. నారాయణపేటలో రోడ్డు విస్తరణలో భాగంగా అసుర్‌ఖానాకు నష్టం వాటిల్లింది. స్థలాన్ని గుర్తించి నిర్మించాల్సిందిగా కలెక్టరును ఆదేశించాం. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తున్నాం. దీని పరిరక్షణ కోసం అధికార భాషా సంఘంలో ఉర్దూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షులుగా నియమిస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సమావేశంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌ సాహబ్‌, మౌలానా ఖలీద్‌ సైఫుల్లా రహ్మానీ, మౌలానా సయ్యద్‌ కుబూల్‌ బాద్‌షా షట్టారి, మౌలానా రహీముద్దీన్‌ అన్సారీ, మౌతమీమ్‌ దారుల్‌ ఉలూమ్‌ రహ్మానియా, ముఫ్తీ రహ్మానీ, మౌలానా సయ్యద్‌ అక్బర్‌ నిజాముద్దీన్‌ హుస్సేనీ, మౌలానా హమీద్‌ మొహమ్మద్‌ ఖాన్‌ సాహబ్‌, మౌలానా జియాఉద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:సచివాలయంలో కూల్చిన మసీద్​కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ

ABOUT THE AUTHOR

...view details