రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులతో రాత్రి పది గంటల వరకు సీఎం చర్చించారు. కరోనా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు, ఫలితాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వైద్యఆరోగ్యశాఖ కృషి అమోఘం..
వ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. కరోనా బాధితులు కలిసిన ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖ కృషి అమోఘమని ప్రశంసించారు. గొప్ప సేవలు అందిస్తోన్న.. సిబ్బంది భద్రతపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించిందన్నారు. సిబ్బంది ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు.