KCR National Party updates: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం కుదిరింది. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. విజయదశమి రోజున తెరాస కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం తెలపనున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ మంత్రులు, తెరాస జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమైన గులాబీ దళపతి.. జాతీయ పార్టీపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయబోతున్నారని.. సమావేశంలో పాల్గొన్న తెరాస నేతలు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నేతలు అన్నారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలు.. కేసీఆర్ జాతీయ పార్టీలో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయని.. ఈ నెల 5న కొందరు నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 9న దిల్లీలో బహిరంగ సభ నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
దసరారోజు జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నారు. అదేరోజు తెరాస ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు, రాష్ట్రకార్యవర్గ సమావేశం జరగనుంది. జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని తెరాస విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే 33 జిల్లాల అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు.
ఈనెల 6 లేదా 7న బహిరంగ సభ: జాతీయపార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు బాణాసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ నేతలతో కార్యచరణ సిద్ధం చేయనున్నారు. దసరారోజు వివిధరాష్ట్రాలకు చెందిన రైతు,కార్మికసంఘాలు, పార్టీలనేతల్ని ప్రగతిభవన్‌లో భోజనానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 లేదా 7న భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.
ఇక సుడిగాలి పర్యటనలు:దేశమంతటా తెలంగాణ మోడల్ అనే నినాదం, అజెండాతో తొలి అడుగువేసేందుకు గులాబీదళపతి సిద్ధమవుతున్నారు. భాజపా, కాంగ్రెస్‌కి సమదూరం పాటిస్తూ వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారు. పర్యటనల కోసం సొంతంగా విమానం కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. భాజపా, కేంద్రంపై ప్రధానంగా దాడిచేస్తూ రైతు, దళిత, కార్మిక,యువత, మహిళల అంశాలపై ఉద్యమానికి శ్రీకారంచుట్టేలా వ్యూహాలు రచించారు. పలురాష్ట్రాలకు సమన్వయకర్తల్ని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలను వివిధ దశల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: