Jubilee Hills Car Accident Update: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన కాజల్ ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉందని ఆమె కుటుంబీకులు చెప్పారు. మహారాష్ట్ర అహ్మద్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. మూడు చోట్ల ఎముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు.
రెండున్నర నెలల క్రితం కాజల్‌కు సిజేరియన్ కాన్పు జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె రెండున్నర నెలల బాబూ చనిపోయాడు. కాన్పుకు సంబంధించిన కుట్ల దగ్గర గాయాలు కావడంతో వైద్యులు మరోసారి శస్త్ర చికిత్స చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల తర్వాత ఎముకలకు సంబంధించిన శస్త్ర చికిత్స చేస్తారని ఆమె తండ్రి సురేష్ పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల వరకు ఖర్చైనట్లు ఆయన చెప్పారు.
అసలేం జరిగిందంటే...
Jubilee Hills Car Accident: ఈ నెల 14న రాత్రి 8 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద రహదారి దాటేందుకు డివైడర్‌పై ఉన్న ముగ్గురు మహిళలను కారు ఢీకొట్టింది. కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ అంటించి ఉంది. ప్రమాదంలో కాజల్ కుమారుడు ఘటనా స్థలంలోనే చనిపోగా.. తీవ్ర గాయాలపాలైన ఆమెను జూబ్లీహిల్స్ పోలీసులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
సారిక, సుష్మలకు స్వల్ఫ గాయాలు కావడంతో చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. కాజల్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలోనే ఉంచారు. 15వ తేదీ సాయంత్రం సమయంలో ఆమె ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయింది. కారు ప్రమాదానికి కారణమైన వాళ్లే బాధితులను మభ్యపెట్టి మహారాష్ట్రకు పంపించినట్లు ఆరోపణలు వినిపించాయి. అంబులెన్స్‌లో నేరుగా మహారాష్ట్ర వెళ్లిన బాధితులు, కాజల్‌ను అహ్మద్ నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కుమారుడు చనిపోయిన విషయాన్నీ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఆమెకు చెప్పలేదు.
ఇదీ చదవండి:Jubilee Hills Accident Case Update : జూబ్లీహిల్స్ ప్రమాద ఘటనలో కారు నడిపింది అతనే..