తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో ఉమ్మడి నియామకాలు

Joint Recruitment : రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం.. బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు పని విధానం, ఇతర మార్గదర్శకాలు త్వరలో విడుదలకానున్నాయి.

Joint Recruitment in 15 Univarsities and Government orders setting up a board
Joint Recruitment in 15 Univarsities and Government orders setting up a board

By

Published : Jun 24, 2022, 7:03 AM IST

Joint Recruitment: రాష్ట్రంలోని మొత్తం 15 విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉమ్మడి బోర్డును నియమించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మనే దీనికీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఉమ్మడి బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఏప్రిల్‌ 12న జరిగిన మంత్రి మండలి సమావేశంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనల దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండ్రోజుల క్రితం సంతకం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం బోర్డు నియామకంపై జీవో 16 జారీ చేశారు. బోర్డులో విద్యా, ఆర్థికశాఖల కార్యదర్శులు సభ్యులుగా, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా ఉంటారు. కాలానుగుణంగా ఈ బోర్డు అవసరమైన నిపుణులను కూడా నియమించుకుంటుందని జీవోలో పేర్కొన్నారు. బోర్డు పని విధానం, ఇతర మార్గదర్శకాలు త్వరలో విడుదలకానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 రాష్ట్ర వర్సిటీలుండగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీల్లో నియామకాలకు ప్రత్యేక నిబంధనలుండటంతో ఈ బోర్డు పరిధి నుంచి వాటిని మినహాయించారు.

ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసినా.. నియామక ప్రక్రియకు ఇంకా పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత చట్టాల ప్రకారం సిబ్బంది భర్తీ అధికారం విశ్వవిద్యాలయాలకే ఉంది. ఇప్పుడు కొత్త విధానం తీసుకురావాలంటే వర్సిటీల చట్టాల్లో సవరణలు చేయాలి. అందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలి లేదా గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ తీసుకురావాలి.

బోర్డుతో ఉపయోగం ఏమిటంటే...?నియామకాల సందర్భంలో కొందరు ఉపకులపతులు అవినీతికి పాల్పడుతున్నారు. ఆ విషయం పలుమార్లు బహిర్గతమైంది. అంతేకాకుండా ఒక్కో వర్సిటీ ఒక్కో సారి నియామకాలు జరిపితే చిన్న వర్సిటీల్లో నియమితులైన వారు మళ్లీ పెద్ద వర్సిటీలకు వెళ్లిపోతున్నారు. దానివల్ల నిత్యం ఖాళీలు ఉంటున్నాయి. ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేస్తే....అన్ని వర్సిటీల్లో ఖాళీలకు ప్రవేశ పరీక్ష జరిపి...ఇంటర్వ్యూలు నిర్వహించి... పోస్టింగ్‌లు ఇవ్వొచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం.

15 వర్సిటీలు ఇవే...ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఓయూ, కేయూ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ(నల్గొండ), జేఎన్‌టీయూహెచ్‌, తెలుగు, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), బాసర ఆర్‌జీయూకేటీ, అంబేడ్కర్‌ సార్వత్రిక వర్సిటీలున్నాయి. వాటితో పాటు రాష్ట్రంలోని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన, కొత్తగా ఏర్పాటైన మహిళా, అటవీ విశ్వవిద్యాలయాలు కూడా బోర్డు పరిధిలోకి వస్తాయి.

11 విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు 4,794..రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 2,800లకుపైగా మంజూరు పోస్టులున్నాయి. వాటిల్లో ప్రస్తుతం 850 మంది సహాయ, సహ ఆచార్యులు, ప్రొఫెసర్ల హోదాలో పనిచేస్తుండగా ఇంకా 2,020 పోస్టులు భర్తీచేయాలి. 2,774 బోధనేతర పోస్టులనూ నింపాలి. ఉన్నత విద్యలో మొత్తం 7,878 ఖాళీలు భర్తీ చేస్తామని ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రకటించగా అందులో వర్సిటీల్లోనే 4,794 ఉన్నాయి. మిగిలిన నాలుగు వర్సిటీల్లో మరికొన్ని ఖాళీలుంటాయని అంచనా. ఖాళీలెన్ని ఉన్నా గత మంత్రిమండలి సమావేశంలో సుమారు 3,500 కొలువులను బోర్డు ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details