Bank Fraud in Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో నాగేందర్... నగదు ఇన్‌ఛార్జీగా విధులు నిర్వర్తించేవాడు. గత జూన్ 21 నుంచి ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజర్యయాడు. బ్యాంకు ఉన్నతాధికారులు అతడిని ఫోన్‌లో సంప్రదించగా.. సమీప బంధువు చనిపోయాడని.. కాస్త ఆలస్యంగా వస్తానని బదులిచ్చాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి.. ఓ ఖాతాదారుడి ద్వారా స్ట్రాంగ్ రూం తాళాలను బ్యాంకుకు పంపాడు. బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి స్ట్రాంగ్ రూం లాకర్లు తెరిచి పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
స్టాంగ్‌రూంలో పరిస్థితి చూసి అధికారులు కంగుతిన్నారు. 2 కోట్ల 32లక్షల నగదు, సుమారు 72 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బ్యాంకు పరిధిలోని 3 ఏటీఎంలలోనూ 2 కోట్ల 19లక్షలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వారి ఆదేశాలతో స్ట్రాంగ్ రూం, ఏటీఎంలలోని... సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌రూంను ఒక్కడే తెరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. గత ఫిబ్రవరి 25న నాగేందర్... ఖాతాదారుల సొత్తు దోచుకెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిర్థారణకు వచ్చారు.