Rahul Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలో ప్రారంభమై మొత్తం 13 రోజులు యాత్ర కొనసాగనుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజి సెంటర్లో భారత్ జోడో యాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 360 కిలోమీటర్ల మేర రాహుల్ జోడో యాత్ర ఉంటుందని జైరాం రమేష్ పేర్కొన్నారు. రోజుకు 31 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందని అన్నారు. దసరా సందర్భంగా రాహుల్ 2 రోజులు విరామం తీసుకున్నారన్నారు. ఎల్లుండి నుంచి మళ్లీ జోడో యాత్ర మొదలౌతుందని జైరాం రమేష్ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 4రోజుల పాటు 95 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు.
తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చరిత్ర సృష్టిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్పై భాజపా ప్రభుత్వం అనేక విధాలుగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని ధ్వజమెత్తారు. దేశంలో పేదవాడు ఇంకా అట్టడుగు స్థాయికే దిగజారిపోతున్నాడని అన్నారు. నిత్యవసర ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేవు.. పేరు మారిస్తే అభివృద్ధి జరిగిపోదని సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు.
ఈ సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిటీల ఇంఛార్జ్ కొప్పుల రాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, భారత్ జోడో యాత్ర జాతీయ కమిటీ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భారత్ జోడో కన్వీనర్ బలరాం నాయక్, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు.