తెలంగాణ

telangana

ETV Bharat / city

బూట్లు, యూనిఫాం లేకుండానే విద్యా కానుక కిట్లు... అడిగితే..? - cm jagan latest news

Jagananna vidyakanuka: 'పిల్లలు బడిలోకి అడుగు పెడుతుండగానే విద్యా కానుకను వారి చేతుల్లో పెడుతున్నాం' అన్న ఏపీ సీఎం జగన్​ మాటలు నీటిమీద రాతలుగానే మిగిలాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. బూట్లు, యూనిఫాం లేకుండానే విద్యా కానుక కిట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదని... వచ్చే నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందే! అని సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు.

Jagananna vidyakanuka
Jagananna vidyakanuka

By

Published : Jul 22, 2022, 12:33 PM IST

Jagananna vidyakanuka: ‘‘నిరుడు కంటే ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు చేరతారేమోనని వారిని మనసులో పెట్టుకొని దాదాపు 47 లక్షల మందికి కిట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగానే.. పిల్లలు బడిలోకి అడుగు పెడుతుండగానే విద్యా కానుకను వారి చేతుల్లో పెడుతున్నాం. -ఆదోనిలో ఈనెల 5న విద్యాకానుక ప్రారంభసభలో సీఎం జగన్‌

* ‘‘అనివార్య కారణాల వల్ల యూనిఫాం క్లాత్‌, బూట్లు ఆలస్యమయ్యాయి. ఈ రెండు మినహా మిగతా వాటితో ఈనెల 25లోపు పంపిణీ పూర్తిచేయాలి. 25 తర్వాత యూనిఫాం, బూట్లతో కలిపి జగనన్న విద్యా కానుక పూర్తి స్థాయిలో అందజేయాలి’’- ఈనెల 18న వర్చువల్‌ సమావేశంలో అధికారులు

20 రోజుల అదనపు సమయం ఉన్నా..:గతంలోలాగా జూన్‌ 12న పాఠశాలలను తెరిచి ఉంటే విద్యార్థులు ఎవరికీ కిట్లు అందే పరిస్థితి ఉండేది కాదు. ఈసారి జులై 5న తెరవడంతో 20 రోజులకు పైగా అదనపు సమయం లభించింది. కానీ, ఇప్పటికీ విద్యార్థులకు కానుక పూర్తిగా అందడం లేదు. బ్యాగులు, ఏకరూప దుస్తులు, బూట్లు అందలేదు. కొందరికి ఒక సబ్జెక్టు పాఠ్య పుస్తకాలు ఇస్తే మరొకరికి మరో సబ్జెక్టు ఇస్తున్నారు. ఎనిమిదో తరగతికి సీబీఎస్‌ఈ పుస్తకాల సరఫరా సరిగాలేదు.

కిట్‌లో అందించాల్సినవి:మూడు జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, ద్విభాష పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఆరో తరగతికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, ఒకటో తరగతి మరో నిఘంటువు.

పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యాకానుక కిట్లు ఇస్తామని ఏపీ సీఎం జగన్‌ ప్రకటించి 2 వారాలు గడిచినా ఇప్పటికీ పంపిణీ పూర్తి కాలేదు. పూర్తిస్థాయి కిట్లు పొందిన విద్యార్థులు 40శాతం లోపే. పాఠ్యపుస్తకాలు అందరికీ అందలేదు. బ్యాగులు, బూట్లు, ఏకరూప దుస్తుల సరఫరా సరిగా లేదు. ఉపాధ్యాయులు ఏ వస్తువు వస్తే దాన్నే పంపిణీ చేస్తున్నారు. దుస్తులు, బూట్ల కోసం విద్యార్థులు మరో నెల ఎదురుచూడాల్సిన పరిస్థితి. అప్పటి వరకు గతేడాది ఇచ్చినవాటినే ధరించి బడులకు రావాల్సిందే. సైజు సరిపోక అవి కరుస్తున్నాయని విద్యార్థులు కొందరు వాపోతున్నారు. ఈ రెండు వస్తువులు వందశాతం విద్యార్థులకు అందించేందుకు ఆగస్టు నెలాఖరు వరకు పట్టే అవకాశం కనిపిస్తోందని విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. వీటిని మినహాయించి మిగతావి పంపిణీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గుత్తేదారు సరఫరాచేస్తున్న ప్రకారంచూస్తే ఆగస్టు నెలలోనూ వందశాతం అందే పరిస్థితి కనిపించడంలేదు. విద్యా కానుక కిట్లు ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఉపాధ్యాయులను తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.

దుస్తులు లేవు.. కుట్టుకూలీ లేదు..

* ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ కలిపి 45.94 లక్షల మంది పిల్లలకు అన్ని వస్తువులను కిట్‌ రూపంలో అందించాల్సి ఉండగా.. ఇంతవరకు అన్ని వస్తువులు అందుకున్న వారు 40 శాతంలోపే ఉన్నారు.

* విద్యార్థులు ఏకరూప దుస్తులను కుట్టించుకునేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ కుట్టుకూలీని ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదు. గతేడాది ఇవ్వాల్సిన కుట్టుకూలీ రూ. 62 కోట్లను ఇటీవల విడుదల చేశారు. ఈ ఏడాదికి సంబంధించి ఇంకా చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట్ల పిల్లలే తమ సొంత డబ్బులతో దుస్తులు కుట్టించుకోవాల్సి వస్తోంది. సైజుల తేడా కారణంగా మూడు జతల కోసం ఇచ్చిన వస్త్రాలు కొంతమందికి రెండింటికే సరిపోతున్నాయి.

* గతేడాది బూట్ల సైజు సరిపోక చాలామంది విద్యార్థులు చెప్పులతోనే బడులకు వచ్చారు. సైజు సరిపోలేదని కొందరు వెనక్కి ఇవ్వగా.. ఆ తర్వాత మళ్లీ సర్దుబాటు చేయలేదు. వెనక్కి ఇస్తే మళ్లీ ఇస్తారో లేదోననే అనుమానంతో కొందరు సైజులు సరిగా లేకపోయినా తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details