ఐటీ(IT) ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్(CORONA VACCINATION) రెండు డోసులు పూర్తవుతుండటంతో ఇక వారిని కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ మేరకు ఎప్పటిలోగా రావాలో గడువు చెబుతూ వారికి ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. మార్చి నాటికి 70శాతం ఉద్యోగులు హాజరయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నాయి. ఇప్పటికే కొన్ని దేశీయ పెద్ద కంపెనీలు, చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు దసరా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం 50శాతం ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు విదేశీ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులు జనవరి నాటికి కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధం కావాలని ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది
రాష్ట్రంలోని 1500కు పైగా ఐటీ కంపెనీల్లో దాదాపు 6.28లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 90 శాతం మంది ఇంటి నుంచి పని(WORK FROM HOME) విధానంలో సేవలందిస్తున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి అనేక ఇతర వర్గాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిచ్చింది. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌లో సహకరించాయి. ఈ క్రమంలో మరో నెలలోగా ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ దాదాపు ముగియనున్నట్లు తెలిసింది. దీంతో నెమ్మదిగా సిబ్బందిని ఆఫీసులకు రప్పించాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2022 మార్చికల్లా 70 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా వారిని అప్రమత్తం చేస్తున్నాయి.